జాతీయ మీడియా క్షమాపణ చెప్పాల్సిందే: హరీశ్ డిమాండ్

  • IndiaGlitz, [Monday,April 01 2019]

టీఆర్ఎస్ కీలకనేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కట్టప్పలా ఉన్న హరీశ్ రావు పార్టీ మారుతున్నట్లు ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చిన విషయం విదితమే. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ హరీశ్ బీజేపీలో చేరుతున్నారని ప్రచురించింది. దీంతో జనాలంతా ఒకింత ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమే అనుకున్నప్పటికీ తాజాగా జాతీయ మీడియాలో రావడంతో అందరూ నిజమేనని అనుకున్నారు. అయితే చివర్లో ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ అందర్నీ ఫూల్స్‌ను చేసింది సదర మీడియా సంస్థ. ఈ కథనంపై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

హరీశ్ ట్వీట్ సారాంశం..

నా గురించి ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి వచ్చిన కథనం ఫేక్ న్యూస్‌లకు ఒక ఉదాహరణ. తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం సరికాదు. ముఖ్యంగా దేశం మొత్తం ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో ఇలా వ్యవహరించడం సముచితం కాదు. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచురించవద్దని మీడియా సంస్థలను కోరుతున్నాను. ఏ పేజీలో అయితే తనపై తప్పుడు వార్తను ప్రచురించారో... అదే పేజీలో రేపు (అనగా ఏప్రిల్-02న) నాకు క్షమాపణలు చెప్పాలి' అంటూ ట్వీట్టర్ ద్వారా హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకూ డెక్కన్ క్రానికల్ సంస్థ స్పందించలేదు. మంగళవారం రోజున సారీ చెబుతారా..? చెప్పరా అనేది తెలియాల్సి ఉంది. అయితే సదరు మీడియా సంస్థ క్షమాపణ చెప్పకపోతే హరీశ్ ఏం చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.