Hari Ramajogiah: శాసించే స్థితి ఇంకెప్పుడు..? పవన్ కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ
- IndiaGlitz, [Saturday,December 23 2023]
ఏపీలో మారో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓవైపు అధికార వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుండగా.. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని పోటీకి సై అంటున్నాయి. వైసీపీ విముక్త ఆంధ్రపదేశే లక్ష్యంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) టీడీపీతో పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య(Harirama Jogaiah) సంచలన లేఖ రాశారు.
లోకేశ్(Lokesh) చెబుతున్నట్టుగా ఐదేళ్ల పాటు చంద్రబాబు(ChandrBabu)ను సీఎంగా చేసేందుకు మీరు కూడా ఒప్పుకున్నారా? అని పవన్‌ను జోగయ్య ప్రశ్నించారు. అనుభవజ్ణుడైన చంద్రబాబే సీఎం కావాలన్న లోకేశ్ మాటలను అంగీకరిస్తున్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని జనసేన కార్యకర్తలు కంటున్న కలలు ఇప్పుడు ఏం కావాలని ఆయన నిలదీశారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే రెండు నాయకలు రాజ్యమేలుతున్నారని.. 80శాతం జనాభా ఉన్న బడుగు, బలహీనవర్గాలకు మోక్షం ఎప్పుడని అడిగారు. పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి ఏం సమాధానం చెబుతారన్నారు. ఈ ప్రశ్నలన్నింటికీ సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తున్నామని.. రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జనసైనికులు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని కోరుతున్నా అంటూ లేఖలో పేర్కొన్నారు.