Chiranjeevi:చిరంజీవిని సత్కరించారు సంతోషం.. కానీ బన్నీని ఎందుకు సన్మానించలేదు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా, నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమం స్టార్ట్ చేశారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. పలువురు నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో యంగ్ సెన్సేషన్ హనుమాన్ హీరో తేజ సజ్జా తన డ్యాన్సులతో అదరగొట్టాడు. ముఖ్యంగా మెగాస్టార్ పాటలతో అదిరిపోయే స్టెప్పులు వస్తూ అలరించాడు.
అనంతరం పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవిని ప్రముఖులు ఘనంగా సత్కరించారు. అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్, మురళీమోహన్, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు చిరుకి గౌరవ ప్రతిమలు అందించి, శాలువాతో సత్కరించారు. గత నెలలో లాస్ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా చిరును ఘనంగా సన్మానించారు. అమెరికాలోని అభిమానులు ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మెగాస్టార్‌ను ప్రత్యేకంగా గౌరవించారు. అయితే ఆయనను ఇండస్ట్రీ తరపున ఘనంగా సత్కరిస్తామని గతంలో ప్రకటించినా.. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు.
ఇదిలా ఉంటే ఈ వేడుకలో సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో ఏళ్ల కలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిజం చేస్తూ 'ఉత్తమ జాతీయ నటుడు' అవార్డుని అందుకున్నాడని ప్రశంసించారు. అలాంటి నటుడిని కనీసం ఇండస్ట్రీ సన్మానించకుండా గౌరవం ఇవ్వలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదంటూ ఇండస్ట్రీ ప్రముఖుల తీరుని ఎండగట్టారు. ఇప్పుడు కనీసం చిరంజీవిని అయినా సత్కరించడం సంతోషమని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments