హ్యాపీ బర్త్ డే టు నేచురల్ స్టార్ నాని...
- IndiaGlitz, [Friday,February 24 2017]
విలక్షణ చిత్రాల కేరాఫ్ నేచురల్ స్టార్
నేచురల్ స్టార్ నాని...ఇప్పుడున్న యంగ్ హీరోస్లో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న హీరో. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నాని అసలు నవీన్‌బాబు. చిన్నప్పట్నుంచి ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలను చూసి వాటి ప్రభావంతో సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఎలాగైనా డైరెక్టర్ కావాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం మణిరత్నం అనే చెప్పాలి. చదువు పూర్తి కాగానే దర్శకుడు బాపు దగ్గర దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయినయ్యారు నాని. అంతకు ముందు డైరెక్టర్ నందినీ రెడ్డితో ఉన్న పరిచయం కారణంగా ఆమె చేసిన ఓ యాడ్ ఫిలింలో నటించాడు నాని. ఆ యాడ్ ఫిలిం చూసిన డైరెక్టర్ మోహన్‌కృష్ణ ఇంద్రగంటికి నాని నచ్చడంతో ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా అష్టాచమ్మా సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు. అష్టాచమ్మా సక్సెస్‌తో నాని ట్రాక్ మొత్తం మారిపోయింది. హీరోగా వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నారు. రైడ్, స్నేహితుడా.., భీమిలి కబడ్డీ జట్టు చిత్రాల సక్సెస్‌తో ఆకట్టుకున్నాడు. 2011లో విడుదలైన అలామొదలైంది సినిమా సక్సెస్‌తో అందరికీ మరింత చేరువయ్యాడు నాని. సెగ సినిమా తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నాని నటించిన ఈగ, పిల్ల జమీందార్ చిత్రాలు సెన్సేషనల్ హిట్ కావడంతో నాని రేంజ్ మరింత పెరిగింది. ఎటో వెళ్ళిపోయింది మనసు, పైసా, ఆహా కళ్యాణం, జెండాపై కపిరాజు వంటి చిత్రాల్లో ప్రతి సబ్జెక్ట్‌ను డిఫరెంట్‌గా ఎంపిక చేసుకుంటూ నేచుర్స్టార్ అయ్యారు.
డబుల్ హ్యాట్రిక్ హీరో..
ఎవడే సుబ్రమణ్యం వంటి విభిన్న కథాంశం ఉన్న చిత్రంతో నేచురల్ స్టార్ నాని విజయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడే సుబ్రమణ్యం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకోవడంతో అందరి దృష్టిని మరోసారి ఆకర్షించిన నాని మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్ హీరోగా ఓవర్సీస్ మార్కెట్లో రికార్డ్ క్రియేట్ చేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాథతో సక్సెస్‌తో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మరోసారి నాని నటించిన 'జెంటిల్మన్'తో తిరుగులేని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విరించి వర్మ దర్శకత్వంలో వచ్చిన మజ్నుతో వరుసగా ఐదవ హిట్‌ను తన సొంతం చేసుకున్న నాని..ఫిబ్రవరిలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, త్రినాథరావు కాంబినేషన్లో నాని హీరోగా రూపొందిన క్యారెక్టర్ బేస్డ్ లవ్ ఎంటర్టైనర్ 'నేను లోకల్' సూపర్‌హిట్‌తో డబుల్ హ్యాట్రిక్ హీరోగా అయ్యారు. నేను లోకల్‌తో మరోసారి ఓవర్సీస్ మార్కెట్లో మిలియన్ డాలర్స్ హీరోగా తన సత్తా చాటారు. ఇలా కెరీర్ స్టార్టింగ్ నుండి కథ పరంగా, క్యారెక్టర్ పరంగా ఏదో ఒక కొత్తదనాన్ని చూపుతూ, డబుల్ హాట్రిక్ సక్సెస్‌తో నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకుని విలక్షణ చిత్రాల కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు ఫిబ్రవరి 24. ఇలాంటి పుట్టినరోజులను నాని మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ బర్త్‌డే విషెష్ చెబుతుంది ఇండియా గ్లిజ్డ్...