Modi:చంద్రబాబుకు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ కూడా ట్విటర్ వేదికగా చంద్రబాబుకు విషెస్ తెలిపారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అనుభవజ్ఞుడైన నాయకుడని.. ఆయన నిత్యం ఏపీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతుంటారని కొనియాడారు. ప్రజల సేవలో ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ... ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.
ఇక జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాజకీయంగా, పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు గారు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా ధృడ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ సర్కార్ బనాయించిన కేసులతో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనో నిబ్బరం కోల్పోలేదు. పరిపాలన పటిమతో రాష్ట్ర అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసే నాయకుడు చంద్రబాబు గారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ఓ ప్రకటన విడుదల చేశారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "నేతలు ఎంత మంది ఉన్నా జాతి గర్వపడే నాయకులు కొందరే ఉంటారు. ఆ కొందరిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఉంటారని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు. ఆయన ఒక అనితరసాధ్యుడు, అద్వితీయ దార్శనికుడు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, రేపటి తరాల భవితను తీర్చిదిద్దే మహాశిల్పి. అలాంటి రాజర్షికి ఇవే నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అని చెప్పారు.
అటు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొన్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆయన సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కుప్పం మున్సిపాలిటీ రెండవ వార్డులో వెలసిన కదిరి శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దేవాలయంలో చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూపర్ సిక్స్ పథకాలను ప్రతిబింబిస్తూ వినూత్నంగా ఏర్పాటు చేసిన 74కేజిల భారీ కేక్‌ను భువనేశ్వరి కట్ చేశారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు మిన్నంటుతున్నాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహిస్తున్నారు. కొందరు సైకిల్ ర్యాలీ చేస్తుంటే మరికొందరు అన్నదానం, రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వద్ద ఉన్న సైబర్ టవర్ వద్ద చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగలు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. తమ జీవితాను మార్చిన దార్శకనికుడు చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout