హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ కృష్ణ

  • IndiaGlitz, [Tuesday,May 31 2016]

సూపర్‌స్టార్‌ కృష్ణ...ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. ఎందుకనో ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసినన్ని సాహసోపేతమైన ప్రయోగాలు ఇంకెవ్వరూ చెయ్యలేదన్నది నిజం. ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో చెప్పడానికి హీరో కృష్ణ కెరీర్‌ గ్రాఫ్‌ గొప్ప ఉదాహరణ. ఐదు దశాబ్దాకు పూర్వం తెరపై తనదంటూ ఓ ముద్ర వేయాలనుకుని ఆరాటపడిన గుంటూరు జిల్లా తెనాలి తాలుకా బుర్రిపాలెం నుంచి వచ్చిన యువ హీరో...అంచెలంచెలుగా ఎదిగి నేడు సూపర్‌స్టార్‌ శిఖరంపై అగ్ర సింహాసనంలో ఆసీనులై ఉన్నారు. నటుడిగా ప్రస్థానం ప్రారంభించిన తర్వాత ఓటమికి కుంగిపోవడం, గెలుపుకు పొంగిపోవడం ఆయన డిక్షనరిలో లేదు. 360 చిత్రాలకు పైగా నటించిన ఘనత సాధించిన తొలి తెలుగు సూపర్‌స్టార్‌గా శిఖరాగ్రభాగాన నిలిచారు. ఆయన సినీ భారతాన్ని తరచి చూస్తే ఆయన విజయం వైపు సాగిన ప్రయాణమంతా అనేక అనేక ఆటుపోట్లతో మనకు దర్శనమిస్తుంది. హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా అన్ని కోణాల్లో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు కృష్ణ.

ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌ నువ్వా నేనా అంటూ పోటాపోటీగా సినిమాలు చేసే తరుణమది. అప్పుడు ప్రేక్షకుల దృష్టిలో హీరోంటే వాళ్ళే. అటువంటి చిత్రసీమలో అడుగుపెట్టి సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన తేనెమనసులు' చిత్రం ద్వారా హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే శతదినోత్సవ హీరోగా అందరి దృష్టిని ఆకర్షించారు. కన్నె మనసులు తర్వాత కృష్ణ నటించిన గూఢచారి 116 ఆయనకు పెద్ద విజయాన్ని అందించింది. గూఢచారి 116 అయితే బి, సి క్లాస్‌ సెంటర్లో సైతం రిఅద్భుతమైన కలెక్షన్స్‌ ను రాబట్టింది. ఈ చిత్రంతో కృష్ణ ప్రేక్షకుల్లో తిరుగులేని మాస్‌ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకు విడుదలైన ఇండియన్‌ , తెలుగు కౌబోయ్‌ మూవీగా విడుదలై ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. సాంకేతిక సినిమాగా తెలుగు సినిమా ఖండాంతరాలు వ్యాపించింది. కౌబాయ్‌ సినిమాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. తెలుగు బాండ్‌గా సూపర్‌స్టార్‌ కృష్ణ విన్యాసాలు అభిమానులకు ఇప్పటికీ గుర్తే. గూఢచారి 116 పాత్ర కృష్ణకు అభిమానులను మరింత చేరువ చేసింది. ఓపక్క ఆ తరహా సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సాంఘిక సినిమాల్లో విజృంభించారు. పండంటి కాపురం, ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పచ్చనికాపురం, పచ్చని సంసారం' వంటి శతదినోత్సవ చిత్రాలు దీనికి ఉదాహరణ. మరోపక్క దేశభక్తి సినిమాల్లోనూ నటించారు. తెలుగు వీరలేవరా అన్న అల్లూరి సీతారామరాజు పిలుపు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇంకా మారుమోగుతూనే వుంది.

సంవత్సరానికి 18 సినిమాలు, 14, 13, 12 సినిమాలు విడుదలై రికార్డు సృష్టించడమే కాకుండా రోజుకు రెండు షిఫ్టులతో మూడు షిఫ్టులో 360 చిత్రాలకు పైగా నటించిన ఘనత సాధించిన తొలి తెలుగు సూపర్‌స్టార్‌ క్రెడిట్‌ కృష్ణకే సాధ్యమైంది. 330 చిత్రాల్లో హీరోగా నటించి అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. అంతే కాకుండా 50కి పైగా విజయనిర్మలతో జతగా నటించి ఓకే హీరోయిన్‌తో ఎక్కువ చిత్రాల్లో జత కట్టిన హీరోగా కూడా ఓ అరుదైన రికార్డు సృష్టించారు. వరుసగా ఎడతెరపి లేకుండా సినిమాలు చేసి ఇండస్ట్రీ ఎదుగదలకు పాటుపడ్డ నిర్మాత హీరో కృష్ణ, ఒక సినిమా సరిగా ఆడకపోతే ఆ నిర్మాతని పిలిచి మరో సినిమాకి డేట్స్‌ ఇచ్చి సినిమా చేసుకోమనే మంచి మనసున్న హీరో కృష్ణ. మంచి నటుడిగానే కాకుండా ,మంచి క్రమశిక్షణగల వ్యక్తిగా అందరి హృదయాలను గెలుచుకున్న రియల్‌ హీరో కృష్ణ. తొలి సినిమా స్కోప్‌ చిత్రంగా అల్లూరి సీతారామరాజు', తొలి 70 ఎం.ఎం చిత్రంగా సింహాసనం'ను రూపొందించి తెలుగు సినిమాని టెక్నికల్‌గా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన క్రెడిట్‌ సూపర్‌స్టార్‌ కృష్ణదే! కృష్ణ నటించిన చిత్రాలన్నీ తమిళ్‌, హిందీ భాషల్లో డబ్‌ అయి సంచన విజయాలు సాధించి తెలుగు సినిమా మార్కెట్‌ రేంజ్‌ని పెంచాయి. మోసగాళ్ళకు మోసగాడు ఇంగ్లీష్‌లో కూడా డబ్‌ అయి విజయం సాధించడం విశేషం.

ఎన్టీఆర్‌తో దేవుడు చేసిన మనుషులు' వంటి భారీ మల్టీస్టారర్‌ని నిర్మించి మల్టీస్టారర్‌ చిత్రాల చరిత్రలో కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసారు కృష్ణ. అలాగే సూపర్‌స్టార్‌ కృష్ణ 50కి పైగా మల్టీస్టారర్‌ చిత్రాల్లో నటించి అత్యధిక మల్టీస్టారర్స్‌ లో నటించిన రికార్డ్‌ ని సృష్టించారు. ఎన్‌.టి.ఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, శివాజీ గణేషన్‌, రజనీకాంత్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాకృష్ణ, నాగార్జున ఇలా అందరి హీరోలతో కలిసి నటించిన హీరోగా కృష్ణ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నిర్మాతగా మోసగాళ్ళకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, ఈనాడు' వంటి సంచన చిత్రాలు నిర్మించిన కృష్ణ దర్శకుడిగా సింహాసనం, కొడుకు దిద్దిన కాపురం, వంటి హిట్‌ చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. అలాగే 1973లో నేరము శిక్ష, పుట్టిన్లిల్లు మెట్టినిల్లు, మాయదారి మల్లిగాడు, గంగ మంగ, మీనా' వంటి బ్లాక్‌ బస్టర్స్‌ ఇచ్చిన ఘనత కూడా కృష్ణదే.

ఎప్పటికప్పుడు హీరోగా అత్యధిక చిత్రాలు చెయ్యడమే కాదు, అత్యధిక హిట్స్‌ అందించిన క్రెడిట్‌ కూడా కృష్ణ దక్కించుకున్నారు. 1983లో ముందడుగు, కిరాయి కోటిగాడు, రామ రాజ్యంలో భీమరాజు, అడవి సింహాలు, శక్తి, ప్రజారాజ్యం, పోరాటం, అమాయకుడు కాదు అసాధ్యుడు' ఇలా ఒకే సంవత్సరంలో 8 హిట్‌ చిత్రాలు ఇచ్చిన హీరోగా ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకున్నారు. 1985లో అగ్ని పర్వతం, వజ్రాయుధం, పల్నాటి సింహం' వంటి బ్లాక్‌ బస్టర్స్‌ తో పచ్చని సంసారం, సూర్యచంద్ర' వంటి సూపర్‌హిట్స్‌ తో ఒకే సంవత్సరంలో 5 సూపర్‌డూపర్‌ హిట్స్‌ ఇచ్చిన ఘనత కూడా కృష్ణదే. కెరీర్‌ ప్రారంభం నుండి సంక్రాంతి చిత్రాన్నీ దాదాపు ఘన విజయాలు సాధించిన హీరోగా కృష్ణ మరో రికార్డ్‌ సృష్టించారు. అసాధ్యుడు, పాడి పంటలు, అమ్మదొంగా, నెంబర్‌వన్‌, పచ్చని సంసారం, సంప్రదాయం' వంటి సంక్రాంతి హిట్స్‌ సూపర్‌స్టార్‌ని సంక్రాంతి హీరోను చేశాయి. ఈ జూన్‌ 3న శ్రీశ్రీ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఐదు దశాబ్దాల నట ప్రస్థానంలో ప్రయోగాలకు వెరవని తత్వం, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం సూపర్‌స్టార్‌ కృష్ణకే చెల్లింది. ఆయన పుట్టిన రోజు మే 31. ఇలాంటి పుట్టినరోజును ఆయన మరెన్నింటినో జరుపుకోవాలని కోరుంటూ సూపర్‌స్టార్‌ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షను తెలియజేస్తోంది ఇండియా గ్లిజ్డ్.