హ్యాపీ బర్త్ డే టు నటసింహ బాలకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి నటనలో వాడి, డైలాగ్స్‌లో పవర్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. రొటీన్‌కు భిన్నంగా విభిన్నమైన చిత్రాల్లో, క్యారెక్టర్స్‌లో నటిస్తూ అబాలగోపాలాన్ని అలరిస్తున్నారు. వారసత్వాన్ని ఏదో స్వీకరించామని కాకుండా ఓ బాధ్యతగా తీసుకుని వంద చిత్రాలకు విభిన్న చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా నాలుగు దశాబ్దాలకు పైగా నటించి నందమూరి నటవారసుల్లో తన ప్రత్యేకతను చాటుకున్న హీరో బాలకృష్ణ. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మైలురాళ్లు. తెలుగునాట అగ్ర కథానాయకుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ సాధించిన విజయాలకు కొదవేలేదు.
బాలనటుడిగా రంగ ప్రవేశం..
బాలనటుడిగా పద్నాలుగేళ్ళకే తాతమ్మ కల అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆసక్తికరమైన విషయమేమంటే తండ్రి స్వర్గీయ నటరత్న నందమూరి తారకరామారావు ఈ సినిమాకు దర్శకుడు కావటం గమనార్హం. తొలినాళ్ళలోనే నటనాసక్తిని కనబరిచి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు. సినిమా కెరీర్ పారంభంలోనే అన్నదమ్ముల అనుబంధం, అనురాగదేవత, రౌడీ రాముడు-కొంటెకృష్ణుడు వంటి సాంఘిక, దానవీరశూరకర్ణ పౌరాణిక, వేముల వాడ భీమకవి, అక్బర్ సలీం అనార్కలి వంటి చారిత్రక సినిమాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా తన అసమాన ప్రతిభను చాటుకున్నారు. 1984లో సాహసమే జీవితం సినిమాతో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మారారు. మంగమ్మగారి మనవడుతో సూపర్‌హిట్ కొట్టి క్రేజ్ పెంచుకున్నారు. ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, నారి నారి నడుమ మురారి, అనసూయమ్మగారి అల్లుడు, మువ్వగోపాలుడు వంటి సినిమాలు భారీ విజయాలు సాధించడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాలకృష్ణను దగ్గర చేశాయి. తండ్రి ఎన్టీఆర్ నుండి పుణికి పుచ్చుకున్న నటనా కౌశలంతో కమర్షియల్, సామాజిక చిత్రాల్లోనే కాకుండా పౌరాణిక పాత్రల్లో కూడా మెప్పించారు. కృష్ణార్జున విజయంలో కృష్ణుడు, అర్జునుడు, శ్రీరామరాజ్యంలో శ్రీరాముడి, పాండురంగడులో పాండురంగడు వంటి పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. ఇప్పటి తరం హీరోల్లో పౌరాణిక, జానపదం, సోషియో ఫాంటసీ, చారిత్రక, భక్తిరస, సాంఘిక చిత్రాలు... ఇలా అన్ని రకాల సినిమాల్లో నటించిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. నటుడిగా మూసధోరణి సినిమాలు చేయడానికి బాలకృష్ణ ఇష్టపడరు. అది ఆయన సినిమాలు చూసే ప్రేక్షకుడికి అర్థమవుతుంది.
ఫ్యాక్షన్ సినిమాలకు సరికొత్త నాంది....
తెలుగు చిత్రసీమలో ఫ్యాక్షన్ చిత్రాల్లో నటించి భారీ విజయాలు అందుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణ ఒక్కరే. ఆ దిశగా ముందు అడుగులు వేసింది కూడా ఆయనే. సమరసింహారెడ్డి సినిమాతో భారీ హిట్ కొట్టి తెలుగునాట ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్‌కి నాంది పలికిన నటసింహ నరసింహనాయుడు సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసి బాక్పాఫీస్ బొనాంజాగా నిలిచారు. లక్ష్మీనరసింహాతో పోలీస్ పవర్‌ను చూపి కలెక్షన్స్ కొల్లగొట్టిన బాలయ్య సింహా సినిమాతో బాక్సాఫీస్ వద్ద సింహనాదం చేసి తన డైలాగ్స్‌లో వాడి, వేడి ఏ మాత్రం తగ్గలేదని సినీవిమర్శకులకు చెప్పకనే చెప్పారు.
లెజెండ్‌తో సెన్సేషన్...
రాజకీయాల్లో తిరుగులేని విజయం 2014 నందమూరి బాలకృష్ణకి ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల విడుదలైన లెజెండ్‌తో మరో లెజెండ్రీ హిట్ కొట్టడమే కాకుండా 2014 ప్రత్యక్ష్య రాజకీయాల్లో పాల్గొని హిందూపురం నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలను సమన్వయం చేసుకుంటూ రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సత్యదేవ దర్శకత్వంలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో నటించిన లయన్ చిత్రంతో మరో విజయాన్ని కైవసం చేసుకున్న నటసింహం శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ చిత్రంలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కథ, డైరెక్టర్స్‌కి ప్రాధాన్యతనిచ్చే బాలకృష్ణ ప్రస్తుతం ప్రెస్టిజియస్ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో నటించి తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు.
పోర్చుగల్‌లో పుట్టినరోజు..
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 101వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇప్పుడు సినిమా పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్‌లోనే యూనిట్ సభ్యుల నడుమ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.
గాయకుడిగా ..
తొలిసారి నటనతో పాటు సింగర్‌గా కూడా బాలయ్య పూరి జగన్నాథ్ చిత్రం కోసం పాట పాడారు. అనూప్ సంగీత సారథ్యంలో 'మావా ఏక్ పెగ్ లగావో..' అనే పాట పాడటం అభిమానులకు పెద్ద పండుగేనని చెప్పవచ్చు.
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మాణంలో 102వ చిత్రం ..
నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ 102వ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, మాటలు అందిస్తున్నారు. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
2018లో మోక్షజ్ఞ ఎంట్రీ...
నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018లో మోక్షజ్ఞను భారీ స్థాయిలో లాంచింగ్ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. తాత, తండ్రిల్లాగానే మోక్షజ్ఞ మెప్పిస్తాడని ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
జూన్ 10న పుట్టినరోజు జరుపుకుంటున్న బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజులను మెరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..హ్యాపీ బర్త్ డే టు నటసింహ నందమూరి బాలకృష్ణ...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com