హ్యాపీ బర్త్ డే టు విక్టరీ వెంకటేష్...

  • IndiaGlitz, [Sunday,December 13 2015]

క్లాస్..అయినా, మాస్ అయినా, ఏ పాత్ర చేసినా ఆ పాత్ర‌లో ఒదిగిపోయి...ఆ పాత్ర‌కే వ‌న్నె తెచ్చే క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి త‌న పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నాడు వెంకీ. డిసెంబ‌ర్ 13 అంటే ఈరోజు వెంక‌టేష్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా విక్ట‌రీ ని ఇంటిపేరుగా చేసుకున్న వెంక‌టేష్ గురించి క్లుప్లంగా మీకోసం...

క‌లియుగ పాండ‌వులు..

వెంక‌టేష్ కి చిన్న‌ప్ప‌టి నుంచి చ‌దువంటే బాగా ఇష్టం. ఉన్న‌త విద్య అంతా అమెరికాలోనే కొన‌సాగించాడు. అమెరికాలోని మోంటెర్రీ యూనీవ‌ర్శిటి నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ లో మాస్ట‌ర్ డిగ్రీ చేసారు. ఆత‌ర్వాత ఇండియా వ‌చ్చిన వెంకీ నిర్మాణం రంగంలో ప్ర‌వేశించారు. కానీ అది సంత్రుప్తి క‌లిగించ‌లేదు. అలాంటి స‌మ‌యంలో అనుకోకుండా 1986లో క‌లియుగ పాండ‌వులు సినిమాతో హీరోగా రంగ‌ప్ర‌వేశం చేసారు. హీరోగా తొలి సినిమా స‌క్సెస్ అయ్యింది. అంతే కాదు...తొలి చిత్రానికే నంది అవార్డు వ‌చ్చింది. ఆత‌ర్వాత శ్రీనివాస క‌ళ్యాణం లో సాఫ్ట్ రోల్ తో ముందుకొచ్చారు. ఈ సినిమా కూడా విజ‌యం సాధించింది. ఆ వెంట‌నే బ్ర‌హ్మ‌పుత్రుడు, ర‌క్త తిలకం సినిమాల‌తో యాక్ష‌న్ హీరోగా విజ‌యం సాధించారు.

న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టిన వెంకీ..

క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ గురించి అంద‌రికీ తెలిసిందే. క్లాసిక్ మూవీస్ కి పెట్టింది పేరు. అప్పుడే వెంక‌టేష్ హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. అలాంటి స‌మ‌యంలో స్వ‌ర్ణ‌క‌మ‌లం సినిమాకి వెంకీని ఎంచుకున్నారు. విశ్వ‌నాథ్ న‌మ్మ‌కాన్ని వెంకీ వ‌మ్ము చేయ‌లేదు. ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు న‌టించి మెప్పించాడు...రెండోసారి నంది అవార్డును కైవ‌సం చేసుకున్నాడు. ఏ పాత్ర‌నైనా వెంకీ చేయ‌గ‌ల‌డ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించాడు. ఆత‌ర్వాత వెంక‌టేష్ న‌టించిన మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రం ప్రేమ‌. ఈ చిత్రంలో వెంక‌టేష్‌, రేవతి జంట‌గా న‌టించారు. అద‌ర్భుత‌మైన న‌ట‌న‌తో శ‌భాష్ అనిపించుకున్నాడు. మ‌రోసారి నంది అవార్డు ద‌క్కించుకున్నాడు.

కుటుంబ చిత్రాల క‌థానాయ‌కుడు..

బొబ్బిలిరాజా, చంటి, సుంద‌రకాండ‌, గ‌ణేష్‌...త‌దిత‌ర చిత్రాలతో అటు క్లాస్, ఇటు మాస్ ఆడియోన్స్ ను ఆక‌ట్టుకుని ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు. వెంకీ ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా చేయ‌గ‌ల‌డ‌నిపించుకున్నారు. ప్రేమించుకుందాం రా, క‌లిసుందాం రా, ప్రేమ‌తో రా.. త‌దిత‌ర చిత్రాల‌తో ఇండ‌స్ట్రీలో ఓ కొత్త ఒర‌వ‌డి స్రుష్టించారు వెంకీ. అలాగే కుబుంబ క‌థా చిత్రాల్లో న‌టించి లేడీస్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. కుటుంబ క‌థా చిత్రాల క‌థానాయ‌కుడు అంటే వెంక‌టేషే అనేంత పేరు సంపాదించారు.

కొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికిన వెంకీ..

సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో క‌ల‌సి న‌టించి... మ‌ల్లీస్టార‌ర్ మూవీస్ కి నాంది ప‌లికారు. ఆత‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గోపాల గోపాల మూవీ చేసారు. విజ‌యాన్ని సాధించారు. దీంతో ఇండ‌స్ట్రీలో మ‌ళ్లీ మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ కి ఓ ఊపు వ‌చ్చింది. ద‌టీజ్ వెంకీ.కుటుంబ క‌థా చిత్రాల్లో న‌టించ‌డానికి ఎప్పుడూ ముందుండే వెంకీ ఇటీవ‌ల న‌టించిన మ‌రో కుటుంబ క‌థా చిత్రం ద్రుశ్యం. ఈ చిత్రం ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే.

బాబు బంగారం..

విక్ట‌రీ వెంక‌టేష్, యూత్ ఫుల్ డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న న‌య‌న‌తారం న‌టిస్తుంది. ల‌క్ష్మీ, తుల‌సి చిత్రాల్లో వెంకీ స‌ర‌స‌న న‌టించిన న‌య‌న‌తార మూడోసారి వెంకీ తో జ‌త‌క‌డుతుండ‌డం విశేషం. ఈ చిత్రానికి బాబు..బంగారం అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే..మ‌రో డైరెక్ట‌ర్ క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా న‌టించేందుకు వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే సంవత్స‌రం విభిన్న క‌థా చిత్రాల‌తో అల‌రించ‌డానికి రానున్న వెంకీ కి బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేస్తుంది ఇండియా గ్లిట్జ్.కామ్.