రెండు భిన్నమైన మనస్తత్వాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఆ గొడవలు ప్రేమగా మారుతాయి. ఈ నేపథ్యాన్ని బేస్ చేసుకుని దర్శకుడు మోహన్ బమ్మిడి రాసుకున్న కథ గువ్వ గోరింక. అయితే రెండు భిన్నమైన సమస్యలతో పాటు హీరోకి ఓ మానసిక ఇబ్బందిని సమస్యగా చూపట్టే ప్రయత్నం చేశారు. మరి ఈ గువ్వ గోరింక ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందనేది తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం
కథ:
శిరీష(ప్రియాలాల్)కి సంగీతం అంటే ఎంతో ప్రేమ, అభిమానం. వయొలిన్‌లో మాస్టర్ కావాలని అనుకుంటూ ఉంటుంది. ఈమెకు భిన్నమైన వ్యక్తిత్తం ఉన్న వ్యక్తి సదానంద్(సత్యదేవ్). తనకు సౌండ్ అంటే అసలు పడదు. ఒకరికేమో శబ్దమే ప్రాణం. మరొకరికి శబ్దం అంటే అసలు పడదు. వీరిద్దరూ పక్క పక్క ఇళ్లలో ఉంటారు. ఒకరంటే ఒకరికి పడదు. గొడవలు పడుతుంటారు. ఈ గొడవలు ఇద్దరి మధ్య స్నేహానికి దారి తీస్తుంది. కమ్రంగా అది ప్రేమగా మారే లోపు శిరీష వాళ్ల నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని సదానంద్‌కి తెలుస్తుంది. అప్పుడు తను, శిరీషను దూరం పెడతాడు. ఒకరినొకరు చూసుకోకుండా ఇద్దరు మధ్య ఉన్నది ప్రేమ అని ఎలా తెలుస్తుంది. తెలుసుకునే సమయానికి వారికి ఎదురయ్యే సమస్య ఏంటి? ఆ సమస్యను ఎలా అధిగమించి ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
దాదాపు మూడేళ్ల క్రితం దర్శకుడు మోహన్ బమ్మిడి రాసుకున్న కథ. సినిమా చూస్తే ప్రేమలో ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా ముఖ్యం. దానికి తగ్గట్టు సన్నివేశాలను కూడా హృద్యంగా మలచాల్సిన అవసరం ఉంటుంది. కానీ దర్శకుడు ఇంకా ఎప్పటి కథనో కొత్త కథగా భావించి తెరకెక్కించాడా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ పరంగా చూస్తే సత్యదేవ్, ప్రియాలాల్ మంచి నటననే కనపరిచినా, కాన్సెప్ట్ మరీ పాత చింతకాయ పచ్చడిది. రాహుల రామకృష్ణ, ప్రియదర్శి తమదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. దర్శకుడు మోహన్ బమ్మిడి ముప్పై నిమిషాల షార్ట్ ఫిలిం కథను అనుకుని, దాన్ని రెండు గంటల సినిమాగా వివరించడానికి ప్రయత్నం చేశాడు. అంతే కాకుండా నటీనటుల నుండి మంచి నటనను రాబట్టుకోవడంలో దర్శకుడ ఫెయిల్యూర్ తెరపై కనపడుతుంది. ఓ రకంగా దర్శకుడు వీర్ జరా తరహా కథను చెప్పాలనుకున్నాడా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ ఎలాంటి బలమైన కారణాలు లేకుండా ఒకరి మొహం ఒకరు చూడకూడదని అనుకోవడం సిల్లీగా అనిపిస్తుంది.రంగస్వామి సినిమాటోగ్రఫీ, సురేశ్ బొబ్బిలి సంగీతం ఆకట్టుకునేంతగా ఏమీ లేదు. ఎడిటింగ్ గురించి ఇంతకు ముందే చెప్పినట్లు సినిమాలో సాగదీత మాత్రమే కనపడింది.
చివరగా.. చిన్న నాటి కథతో తెరకెక్కిన గువ్వ గోరింక
Comments