అందరి ఆశీస్సుల తో గుంటూరోడు గొప్ప విజయం సాధించాలి - మోహన్ బాబు
- IndiaGlitz, [Monday,January 30 2017]
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ & బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ జంటగా S.K. సత్య తెరకెక్కించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరోడు. ఈ చిత్రాన్ని క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వరుణ్ అట్లూరి నిర్మించారు. శ్రీవసంత్ సంగీతం అందించిన గుంటూరోడు ఆడియో ఆవిష్కరణోత్సవం హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరై గుంటూరోడు ఆడియో సీడీను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ... గుంటూరోడు అనే మాస్ టైటిల్ కి ప్రేమలో పడ్డాడు అని క్లాస్ ట్యాగ్ లైన్ పెట్టడం బాగుంది.ఈ మూవీ 100% హిట్ అవుతుంది. మనోజ్ తో బిందాస్, పోటుగాడు, పాండవులు పాండవులు తుమ్మెద, ఇప్పుడు గుంటూరోడు చిత్రాల్లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. సంగీత దర్శకుడు వసంత్ సీనియర్ సంగీత దర్శకుడు సత్యం గారి మనవడు. వసంత్ తాతను మించిన మనవడు కావాలి అని కోరుకుంటున్నాను. ఈ సినిమా నిర్మాత మరిన్ని సినిమాలు నిర్మించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ... మనోజ్ లో చాలా ఎనర్జి ఉంది. అతనిలో సగం ఎనర్జి మాకు వచ్చినా బాగుంటుంది అనుకుంటాం. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్నారు.
గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ... ఈ సినిమా టైటిల్ వినగానే నాలో ఎక్సైట్ మెంట్ కలిగింది. ఎందుకంటే... నేను గుంటూరు జిల్లా వాడిని. ఈ చిత్రంలో రెండు మంచి పాటలు రాసాను. వసంత్ అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. తాత గారి పేరు నిలబెట్టేలా సంగీతం అందిస్తారు అని ఆశిస్తున్నాను. డైరెక్టర్ సత్య ఈ సినిమాని చాలా బాగా తీసారు డైలాగ్స్ బాగున్నాయి. మనోజ్ నా నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్నాడు. మా అనుబంధం ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో విష్ణు మాట్లాడుతూ... ఏసుదాసు గారి అబ్బాయి విజయ్ ఈ చిత్రంలో పాట పాడడం ఆనందంగా ఉంది. మ్యూజిక్ విషయంలో మనోజ్ కి ఉన్న టాలెంట్ నాకు లేదు. నాన్న గారిలో ఉన్న ఏక్టింగ్ టాలెంట్ నాకు వస్తుంది అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది ఈ సినిమా నిర్మాతకు సినిమా సక్సెస్ అయి డబ్బులు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ మాట్లాడుతూ... నేను ఐటం సాంగ్స్ తర్వాత టీజింగ్ సాంగ్స్ ఎక్కువ రాసాను.విష్ణుకి మంచి సాంగ్స్ రాసాను. మనోజ్ కి మంచి హిట్ సాంగ్స్ రాయాలి అని వెయింటింగ్ ఈ సినిమాతో నెరవేరుతుంది. డైరెక్టర్ సత్య మంచి రైటర్ మంచి డైలాగ్ రాసారు. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కెరీర్ లో ఈ చిత్రం మైలు రాయిగా నిలుస్తుంది అన్నారు.
హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... నాకు మనోజ్ కి కనెక్షన్ ఉంది. సలీమ్ చేస్తున్నప్పుడు వై.వి.ఎస్ చౌదరి గారు నన్ను చూసారు. అప్పుడు నేను, మనోజ్ క్రికెట్ ఆడుతున్నాం. 10 సంవత్సరా ల నుంచి మనోజ్ తో పరిచయం. చిన్నప్పటి నుంచి మెహన్ బాబు గారికి గ్రేట్ ఫ్యాన్ ని. ఈ చిత్రంలో ప్రగ్యా చాలా బ్యూటీఫుల్ గా ఉంది. మనోజ్, నేను కలిసి బిల్లా రంగా సినిమా చేయాలి అనుకుంటున్నాం అన్నారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ... నేను నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అలాగే ట్విట్టర్ వలన ఫ్యాన్స్ నుంచి తెలుసుకున్నది ఏమిటంటే... కమర్షియల్ సినిమా చేయచ్చు కదా..ఎందుకు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాను అని. నేను 2004లో హీరోగా కెరీర్ ప్రారంభించాను. 13 ఏళ్లలో 18 సినిమాలు చేసాను. నాకు దేవుడిచ్చిన వరం నాన్న గారు. సక్సెస్ తో పాటు సంతోషం ముఖ్యం అని చెప్పారు. ఫెయిల్యూర్ లో కూడా అదే చూడు అన్నారు. నా సంతోషం కోసం ఏక్టర్ గా వచ్చాను. అలాగే డిఫరెంట్ రోల్స్ చేయాలి అని వచ్చాను. మూస పద్దతిలో సినిమాలు చేయడానికి కాదు. నా మనసుకి నచ్చకుండా సినిమాలు చేస్తే అన్యాయం చేసినవాడిని అవుతాను. షూటింగ్ కెళ్లడమే తెలుసు వ్యాపారం చేయడం తెలియదు. ఏ సంబంధం లేకుండా ఫ్లాప్స్ వచ్చినా నన్ను వదలకుండా నడిపించే ఫ్యాన్స్ కు పాదాభివందనం చేస్తున్నాను. వేదం, ప్రయాణం, నేను మీకు తెలుసా, శౌర్య, ఎటాక్...సినిమాలు నా మనసుకు నచ్చడం వలనే చేసాను. ఈ చిత్రాలు నన్ను ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లాయి. నాకు సూపర్ స్టార్ అయిపోవాలి అనే కంగారు లేదు.
అందుచేత నన్ను కన్ ఫ్యూజ్ చేయద్దు. ఇక నుంచి కూడా ఇలాగే డిఫరెంట్ మూవీస్ చేస్తూ కమర్షియల్ సినిమాలు కూడా చేస్తాను. ఒక్కడు మిగిలాడు అనే సినిమాలో ఎల్ టి టి క్యారెక్టర్ చేస్తున్నాను. అది చాలా డిఫరెంట్ మూవీ. ఈ సినిమా గురించి త్వరలో చెబుతాను. ఇక సినిమా హిట్ వస్తేనే కాలు మీద కాలు వేసుకునే ఈ టైమ్ లో దేవుడు ప్రతి హీరోని నాకు మంచి ఫ్రెండ్ ని చేసాడు. ప్రతి హీరో సినిమా హిట్ అవ్వాలి అని ఇంట్లో పూజ చేస్తుంటాం. ఇక ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పాలంటే... ట్యూన్స్ వినగానే అద్భుతంగా ఉన్నాయి అనిపించింది. వసంత్ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. గ్రాఫిక్స్ కూడా వాడకుండా స్టంట్స్ చేసాను. రామ జోగయ్య, భాస్కరభట్ల గారు మంచి పాటలు అందించారు.నా ఆల్ టైమ్ సూపర్ స్టార్ రాజేంద్ర ప్రసాద్ గారితో, అలాగే కోట గారితో కూడా ఫస్ట్ టైమ్ చేసాను. సంపత్ అన్నఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. ఆ దేవుడు ఈ సినిమాతో గొప్ప విజయాన్ని ఇస్తాడని ఆశిస్తున్నాను అన్నారు.
మంచు మెహన్ బాబు మాట్లాడుతూ... మంచి కథ ఇచ్చినా చెడగొట్టవచ్చు...కథను అద్భుతంగా తీయగలిగిన వాడు దర్శకుడు. ఈ చిత్రంలో డైలాగులు కూడా చాలా బాగున్నాయి. దాసరి గారు ఒక్కరే కథ మాటలు స్ర్కీన్ ప్లే అన్ని రాసారు. ఈ సినిమా రష్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. ఈ చిత్ర నిర్మాత ఇంటికి వచ్చినప్పుడు అడిగాను ఎంత ఖర్చు పెట్టారు అని..? ఎందుకు అంత ఖర్చు పెట్టారు అంటే మనోజ్ అంటే అభిమానం అన్నారు. అలాగే మనోజ్ గురించి రకరకాలుగా చెప్పారు కానీ ఎంత మంచి వ్యక్తో వర్క్ చేసిన తర్వాత తెలిసింది అన్నారు. ప్రతి ఒక్కరు గురించి ఏదో చెబుతుంటారు అలా చెప్పడం వలనే యుద్దాలు జరుగుతుంటాయి. మన గురించి ఎవరైనా ఏదైనా చెడుగా చెబితే కర్మ అని వదిలేయాలి.నిర్మాతకు ఈ సినిమా కనకవర్షం కురిపించాలి అని కోరుకుంటున్నాను. రైటర్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఈ సినిమాకి మంచి పాటలు రాసారు. మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు నా సంస్థలో చాలా సినిమాలకు సంగీతం అందించారు. ఆయన దగ్గర ఇళయరాజా గారు, రెహమాన్ వర్క్ చేసారు. సత్యం గారి మనవడు వసంత్ ఈ సినిమాకి సంగీతం అందించడం సంతోషంగా ఉంది.అందరి ఆశీస్సులతో ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలి. ఏసుదాసుకు పద్మవిభూషణ్ రావడం అంటే మన ఇంట్లోకి వచ్చినట్టే అని నా ఫీలింగ్. ఎలాంటి రికమండేషన్ లేకుండా వచ్చింది. ఈ సినిమా యూనిట్ అందరి తరుపున ఏసుదాసు గార్కి అభినందనలు తెలియచేస్తున్నాం అన్నారు.
నిర్మాత వరుణ్ మాట్లాడుతూ... నిర్మాతగా నా ఫస్ట్ ఫిల్మ్ ఇది. సత్యతో సంవత్సరం నుంచి జర్నీ చేస్తున్నాను. ఇంత టాలెంట్ ఉన్న సత్యకి బ్రేక్ ఎందుకు రాలేదు అనిపించింది. మేము కలిసి సినిమా చేయాలి అని రాసిపెట్టి ఉంది అనిపించింది. మనోజ్ బయట ఎలా ఉంటాడో మూవీలో కూడా అలాగే ఉంటాడు. సీనియర్ ఏక్టర్స్ కోట శ్రీనివాసరావు గారు, కాశీ విశ్వనాధ్ గారు, రావు రమేష్ ఇలా అందరితో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వసంత్ కి స్టోరీ బాగా తెలియడం వలనే మంచి ట్యూన్స్ ఇచ్చారు అన్నారు.
డైరెక్టర్ సత్య మాట్లాడుతూ... వసంత్ నా బెస్ట్ ఫ్రెండ్. ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్టర్ కి తగ్గట్టు మ్యూజిక్ అందిస్తాడు. వసంత్ కి ధ్యాంక్స్ తెలియచేస్తున్నాను. మా టీమ్ బాగా సహకరించడం వలన మంచి అవుట్ పుట్ వచ్చింది. విలన్ క్యారెక్టర్ చేసిన సంపత్ చాలా నేచురల్ గా నటించారు. రాజేంద్రప్రసాద్ గారు ఈ చిత్రంలో బెస్ట్ రోల్ చేసారు. ఈ సినిమాలో ఇంట్రస్టింగ్ లవ్ ట్రాక్ ఉంది. ప్రగ్యా జైస్వాల్ చాలా బాగా నటించింది. ఈ సినిమా చూసిన తర్వాత ఆమెతో అందరూ లవ్ లో పడిపోతారు అలా ఉంటుంది ఆమె క్యారెక్టర్. ఇక మా హీరో మనోజ్ గురించి చెప్పాలంటే...కథ ఏమిటి అని అడిగితే రెగ్యులర్ కమర్షియల్ మూవీ మీరు చేస్తే కొత్తగా ఉంటుంది అని చెప్పాను. కథ విని వెంటనే చేస్తాను అన్నారు. ఎంజాయ్ చేస్తూ చేసాం. మంచి మనసు ఉన్న మనోజ్ కి మంచే జరుగుతుంది. గుంటూరోడు మంచి ఎంటర్ టైనర్ అందరికీ నచ్చుతుంది. నా కోసం సినిమా తీసిన నిర్మాత వరుణ్ కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు వసంత్ మాట్లాడుతూ... నేను సినిమా చేయడానికి సత్య, నిర్మాత వరుణ్, మనోజ్ కారణం. ఈ ముగ్గురికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. మంచి సినిమాలు చేయాలి అని చాలా రోజులు నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ సాంగ్స్ నా కెరీర్ లో నిజంగా బెస్ట్ ఆల్బమ్. అన్ని పాటలు బాగా వచ్చాయి. గృహప్రవేశంలో దారి చూపిన దేవత...అనే సాంగ్ ఉంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు మనోజ్ తో సినిమా చేస్తున్నాం కదా ఏసుదాసు గారి అబ్బాయి విజయ్ తో పాట పాడిస్తే బాగుంటుంది అనిపించింది. మోహన్ బాబు గారి అబ్బాయి మనోజ్, ఏసుదాసు గారి అబ్బాయి విజయ్, సత్యం గారి మనవడు నేను కలిసి చేసిన ఈ సినిమాని ఎప్పటికీ మరచిపోలేను అన్నారు.