సెన్సార్ పూర్తి చేసుకున్న 'గల్ఫ్'

  • IndiaGlitz, [Sunday,September 17 2017]

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన 'గల్ఫ్' చిత్రం ఆక్టోబరులో విడుదలకి సిద్ధం అవుతోంది. 'గల్ఫ్' చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది . సెన్సార్ సభ్యులు చిత్రాన్ని వీక్షించి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్ఛారు. చిత్ర నిర్మాతలు యెక్కలి రవీంద్ర బాబు, ఎం. ఎస్. రామ్ కుమార్ తమ శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ అక్టోబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నామని తెలిపారు. ఈ చిత్రంలో గల్ఫ్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల కడగండ్లను కళ్ళకి కట్టినట్లు చూపించామని , అందువలన ఈ చిత్రం ప్రజల హృదయాలకి హత్తుకుని విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.మా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, గల్ఫ్ కార్మికుల కోసం పడుతున్న తపన, తప్పక ఫలప్రదం అవుతుందని, చిత్రంఆంధ్ర , రాయలసీమ, తెలంగాణ ప్రజలని ఆకట్టుకుని విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేసారు.

ఇప్పటికే ఈ చిత్రం ప్రచార చిత్రాలని, పాటలని, వినూత్న తరహా ప్రచారాలని చూసిన ప్రేక్షకులు, పెరుగుతున్న అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలకు వేచి యున్నారని ,సామజిక సమస్యలని వెండితెర పై వాస్తవానికి దగ్గరగా చూపించే దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి,'గల్ఫ్' చిత్రం కోసం అక్కడ నివసిస్తున్న ప్రవాసీ కార్మికుల జీవితాల పై విస్తృత పరిశోధన చేసి ఈ చిత్ర కథని సమకూర్చారని , వెండి తెర పై వాస్తవ పరిస్థితులని ఆవిష్కరిస్తూనే, యువతరానికి నచ్చే హంగులని కూడా చిత్రంలో మిళితం చేసారని నిర్మాతలు తెలిపారు .

సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్ర కథ కోసం అక్కడ నివసిస్తున్న ప్రవాసీ కార్మికుల జీవితాల పై విస్తృత పరిశోధన చేసి , వాస్తవాలకి దగ్గరగా, అదే సమయంలో యువతరానికి నచ్చే విధంగా రొమాంటిక్ మరియు కమర్షియల్ హంగులని సమకూర్చమని తెలిపారు. గల్ఫ్ లో పనిచేస్తున్న 25 లక్షల కార్మికుల సమస్యల పై గళమెత్తి వారికి తమదైన శైలిలో పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని ఆదరిస్తారని సునీల్ ఆశాభావం వ్యక్తం చేసారు. గల్ఫ్ చిత్రం విశేషాలని వివరిస్తూ, తాము తమ చిత్రంలో గల్ఫ్ సమస్యలని వివరంగా చూపించడమే కాకుండా, నిజ జీవితంలో కూడా గల్ఫ్ లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయుల సమస్యలని పరిష్కరించడానికి కమిటీలని, రాష్ట్ర సంస్థలు, స్వచ్చంద సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాలలోని కాక, గల్ఫ్ దేశాలలో కూడా తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు

చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించగా, సంతోష్ పవన్,అనిల్ కళ్యాణ్, పూజిత, సూర్య , శివ, పోసాని, నాగినీడు, జీవ, నల్ల వేణు, ప్రభాస్ శ్రీను, తనికెళ్ళ భరణి,తోటపల్లి మధు, శంకరాభరణం రాజ్యలక్ష్మి,సన, తీర్థ, డిగ్గీ, బిత్తిరి సత్తి,భద్రం, మహేష్, ఎఫ్ ఎం బాబాయ్ తదితరులు ఇతర పాత్రలలో నటి0చారు.

సరిహద్దులు దాటిన ప్రేమ కధ అనే శీర్షికతో వస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ఇమ్మడి సంగీతం సమకూర్చగా, పులగం చిన్నారాయణ సంభాషణలు రాసారు .