కేసీఆర్ స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానానికి వెండితెర దృశ్యరూపమే గులాల్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచవ్యాప్తంగా జరిగిన అహింసాయుత పోరాటాల్లో తెలంగాణ సాధన ఉద్యమం అగ్ర భాగాన వుంటుంది. అరవై ఏళ్ల ఒక జాతి కలను తన పధ్నాలుగేళ్ల పోరాటం ద్వారా కేసీఆర్‌గారు విజయతీరాలకు చేర్చారు. ఆయన స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానానికి వెండితెర దృశ్యరూపమే గులాల్ చిత్రం అన్నారు బందూక్ లక్ష్మణ్. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం గులాల్. ది సింబల్ ఆఫ్ విక్టరీ ఉపశీర్షిక. సమన్వి క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ కొణతం నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కాన్సెప్ట్ మరియు మోషన్ పోస్టర్ ఆవిష్కరణోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు, రచయిత విజయేంద్రప్రసాద్ కాన్సెప్ట్, మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ అలనాడు దాశరథి నిజామాబాద్ కారాగారం సాక్షిగా నినదించారు. తెలంగాణది గొప్ప పోరాటాల చరిత్ర. తెలంగాణ తల్లి రుణం తీర్చుకునే అవకాశం నాకూ రావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్ర నిర్మాణానికి సంకల్పించిన ఇద్దరు లక్ష్మణులు (దర్శకనిర్మాతలు) ఆ కోదండరాముని దివ్యాశీస్సులతో చిత్రాన్ని దిగ్విజయంగా పూర్తిచేయాలని అభిలషిస్తున్నాను అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కేసీఆర్‌గారి జీవిత క్రమాన్ని ఈ సినిమాలో ఐదు భాగాలుగా ఆవిష్కరించబోతున్నాం. కారణజన్ముడి జననం, బాల్యం మొదలుకొని ఉద్యమ ప్రస్థానం, బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతున్న పాలన ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించాం. త్వరలో కేసీఆర్‌గారికి ఈ చిత్ర ఇతివృత్తాన్ని వివరించి, ఆయన అనుమతి తీసుకోవాలనుకుంటున్నాను అన్నారు. ఈ సినిమా కోసం అనేక మంది కవులు, మేధావులను కలుసుకున్నామని, అత్యుత్తమ సాంకేతిక విలువలతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత లక్ష్మణ్ కొణతం పేర్కొన్నారు. బందూక్‌తో జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్న లక్ష్మణ్..ఈ సినిమాతో మరింత గుర్తింపును సంపాదించుకోవాలని నిర్మాత మల్కాపురం శివకుమార్ అన్నారు.
మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ... 2013సంవత్సరంలో వీ6 ఛానెల్ కోసం నా స్వీయరచనలో ఆలపించిన బతుకమ్మ గీతం గురించి విజయేంద్రప్రసాద్‌గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించారు. అమ్మతనాన్ని, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని గొప్పగా వర్ణించానని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసల్ని చిరకాలం నా హృదయంలో పదిలపరచుకుంటాను అన్నారు. ఈ సినిమాలో పాట రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, కేసీఆర్ భావజాలాన్ని మరింతగా ప్రజలముందుకు తీసుకుపోయే చిత్రమిదని గీత రచయిత కందికొండ తెలిపారు. ఈ సినిమా అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ప్రేక్షక జనరంజకంగా నిలవాలని వేడుకలో ప్రసంగించిన ఇతర వక్తలు అభిలషించారు.
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ దర్శకుడు ఇ.నివాస్ (శూల్ ఫేమ్), రమేష్ సామల, సాగర్‌చంద్ర, యోగి, నిర్మాత వల్లూరిపల్లి రమేష్, యుగంధర్‌రావు (బందూక్ నిర్మాత), జీ స్టూడియో ప్రేమ్‌రాజ్‌జోషి, స్వామిగౌడ్, రామ్ తదితరులు పాల్గొన్నారు. వేడుక ఆరంభంలో కేసీఆర్ ప్రస్థానాన్ని వివరిస్తూ సాండ్ ఆర్టిస్ట్ క్రాంతి చేసిన ప్రదర్శన ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com