సినీ ప్రముఖులకు మరోసారి షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

మొన్నటి వరకూ ఐటీ అధికారులు.. ఇప్పుడేమో జీఎస్టీ అధికారులు.. సినీ ప్రముఖులకు దఢ పుట్టిస్తున్నారు!. ఇటీవలే టాలీవుడ్ టాప్ యాంకర్స్ సుమ కనకాల, అనసూయతో పాటు నటి లావణ్య త్రిపాఠిలు జీఎస్టీ కట్టలేదని సోదాలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సోదాలపై సుమ స్పందిస్తూ.. అబ్బే అదేం లేదు సోదాలు జరగలేదని తేల్చేసింది. మిగిలిన ఇద్దరు మాత్రం ఇప్పటి వరకూ ఆ వార్తలను కానీ అస్సలు ఖండించలేదు. సరిగ్గా ఈ ఘటన జరిగి మూడు రోజులు ముగియక మునుపే.. మరోసారి జీఎస్టీ అధికారులు సినీ ప్రముఖుల ఇళ్లపై దాడులు చేశారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ దర్శకులు, నిర్మాతల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా.. బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలలోనూ జీఎస్టీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఆదాయం తక్కువ చూపి ప్రభుత్వానికి టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన జీఎస్టీ అధికారులు ఈ సోదాలు చేపడుతున్నారు. కొందరు సినీ ప్రముఖులను విచారిస్తున్నట్లు కూడా సమాచారం. అయితే ఎవరెవరి ఇళ్లలో ఇలా సోదాలు జరుగుతున్నాయనే విషయంపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ సోదాలతో ఎప్పుడెప్పుడు అధికారులొచ్చి తమ ఇళ్ల మీద పడతారో అని ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆందోళనలో పడ్డారని తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.