హీరో సిద్ధార్థ్ అనగానే తెలుగు సినీ ప్రేక్షకుడికి వెంటనే గుర్తుకొచ్చే పేరు `బొమ్మరిల్లు`. ఆ రేంజ్ హిట్ తర్వాత సిద్ధార్థ్‌కు రాలేదు. తర్వాత తెలుగులో తనకు మంచి హిట్ ఇవ్వని ప్రేక్షకులో, లేక నిర్మాతల కారణంగానో మరేదైనా కావచ్చు కానీ, సిద్ధార్థ్ తమిళ సినిమాల్లోనే ఉండిపోయాడు. చాలా గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ చేసిన త్రిభాషా చిత్రం `గృహం`. నిజానికి తెలుగులో ఈ సినిమా రెండు వారాల క్రితమే విడుదల కావాల్సింది కానీ కుదరలేదు. తమిళం, హిందీల్లో విడుదలైన తర్వాతే తెలుగులో విడుదలైన ఈ సినిమా గృహం. ఈ సినిమా విషయానికి వస్తే..హారర్ సినిమా కావడం, అందులో సిద్ధార్థ్, ఆండ్రియాలు నటించడం తప్ప సినిమా విడుదలకు ముందు పెద్దగా హైప్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు గృహంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా కథలోకి ఓ లుక్కేద్దాం..
కథ:
సినిమా 1935 బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. రోషిని వ్యాలీలో ఓ ఇంట్లో ఓ చైనీస్ తల్లి, పాప, తల్లి ఆనందంగా ఉంటారు. గర్భిణిగా ఉన్న చైనీస్ తల్లి..అల్రెడి తనకు పుట్టిన పాపాయితో సంతోషంగా ఉంటుంది. వెంటనే కథ ఈ జనరేషన్‌లోకి ఎంట్రీ అవుతుంది. బ్రెయిన్ ఆపరేషన్ చేసే డాక్టర్ కృష్ణకుమార్(సిద్ధార్థ్), తన భార్య లక్ష్మి(ఆండ్రియా)తో కలిసి రోషన్ వ్యాలీ వస్తాడు. కొన్నిరోజుల తర్వాత వీరి పక్కింట్లోకి పాల్(అతుల్ కులకర్ణి) తన ఫ్యామిలీతో సహా వస్తాడు. పాల్‌కు ఇద్దరు కూతుళ్లు. జెన్ని(అనీషా విక్టర్), మరో చిన్నమ్మాయి పాల్ కూతుళ్లు. వచ్చిన వారం రోజులకు పాల్ తన ఇంట్లో పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో జెన్ని ఇంట్లోని బావిలో పడిపోవడం చూసిన కృష్ణకుమార్ నూతిలోకి దూకి ఆమె ప్రాణాలు కాపాడుతాడు. అప్పటి నుండి జెన్ని విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాంతో కృష్ణ, తన హాస్పిటల్‌లోని సీనియర్ సైక్రియాటిస్ట్(సురేష్)తో జెన్నికి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తాడు. జెన్ని చెప్పే దాని ప్రకారం ఆ ఇంట్లో రెండు ఆత్ములున్నాయని, అవి తమను ఇళ్లు వదిలిపోమ్మంటున్నాయని తెలుస్తుంది. అయితే సైక్రియాటిస్ట్ ముందు దాన్ని తేలికగా తీసుకుంటాడు. కానీ జెన్ని ప్రవర్తనలో మార్పు రాదు. అప్పుడు తమకు తెలిసిన ఓ చర్చి ఫాదర్‌ను పిలిచి, జెన్నికి భూత వైద్యం చేసినట్లు నాటకం ఆడమంటారు. కానీ జెన్ని వాళ్ల ఇంట్లో నిజంగానే ఆత్మలున్నాయని వారికి అప్పుడు తెలుస్తుంది. పాల్ ఓ భూత వైద్యుడిని పిలిచి తన ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు డాక్టర్ కృష్ణ, సైక్రియాటిస్ట్‌లు అసలు ఏం జరిగిందనే దానిపై పరిశోధనలు చేయడం మొదలు పెడతారు. చివరకు ఇద్దరికి తెలిసే విషయమేంటి? అసలు ఆత్మ ఎవరు? ఆత్మ ఎందుకు పాల్ ఇంటిపై పగబట్టడానికి కారణమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
ప్లస్ పాయింట్స్:
హారర్ సినిమాల్లో కథ చిన్నదిగానే ఉంటుంది. కథనం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బలంగా ఉంటే సినిమా ప్రేక్షకులకు నచ్చేస్తుంది. అలాగే చెప్పాలనుకున్న పాయింట్‌ను చివరి వరకు సస్పెన్స్‌గా మెయిన్ చేయడం వంటి అంశాలు ప్రధానంగా ఈ సినిమాకు పెద్ద బలం అయ్యాయి. సినిమాలో డిఐ, సిద్ధార్థ్, సురేష్, ఆండ్రియా, జెన్ని వంటి నటీనటులు, టెక్నిషియన్స్ పనితీరు చాలా బావుంది.
మైనస్ పాయింట్స్:
హారర్ సినిమాలంటే కథల్లో కొత్తదనం ఉండదు. ఓ ఇంట్లోకి వెళ్లిన ఓ జంట ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది. అందరూ ఆత్మల నుండి ఎలా భయపడ్డారు.. ఇలాంటి కాన్సెప్ట్‌లను ఇంగ్లీష్ సినిమాల నుండి మనం చూసి ఉండటమే.
విశ్లేషణ:
హారర్ సినిమాలల్లో దర్శకుడు కొత్తగా చెప్పడానికి ఏం ఉండదు. సన్నివేశాలను ఎంత ఆసక్తికరంగా మలిచారనే దానిపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. గృహం విషయానికి వస్తే 1935కి, ఇప్పటికి లింక్ పెట్టి దర్శకుడు మిలింద్ సినిమాను తెరకెక్కించిన విధానం బావుంది. సినిమాకు ప్రదానబలం గిరీష్ అందించిన నేపథ్య సంగీతం. ఎక్కడ సీన్ సైలెంట్‌గా ఉండాలో, ఎక్కడ ఎంత మేర సౌండ్ కావాలో ..అనే విషయాలను మ్యూజిక్ డైరెక్టర్ గిరీష్ చక్కగా ఫాలో అయ్యాడు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీలో కలర్ కాంబినేషన్..పిక్చరైజేషన్ బావున్నాయి. ఇక సన్నివేశాల విషయానికి వస్తే..ఇంటర్వెల్‌లో జెన్ని శరీరంలోకి ఆత్మ ప్రవేశించినప్పుడు ఆమె చేసిన నటన, అలాగే క్లైమాక్స్‌లో సిద్ధార్థ్ నటన ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం హారర్ సినిమాలంటే హారర్ కామెడీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పూర్తిస్థాయి హారర్ చిత్రాన్ని చూడాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.
బోటమ్ లైన్: 'గృహం'... పూర్తిస్థాయి హారర్ చిత్రం.. మెప్పిస్తుంది
Comments