Kasthuri :గృహలక్షీ తులసికి ప్రాణాంతక వ్యాధి.. ఆల్రెడి శరీరమంతా పాకేసిందిగా, ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కస్తూరి

  • IndiaGlitz, [Tuesday,February 21 2023]

టాలీవుడ్ టూ కోలీవుడ్ ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా హీరోయిన్ల ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా పలువురు భామలు అనారోగ్యం బాధపడుతున్నారు. సమంత, పూనమ్ కౌర్, హంసా నందిని, మమతా మోహన్ దాస్ ఇలా చెప్పుకుంటే పోతే ఆ లిస్ట్ ఇక్కడితో ఆగదు. పలువురు అలనాటి హీరోయిన్లు కూడా తమ ఫలానా అనారోగ్యం బారినపడ్డామని చెబుతూ కన్నీటిపర్యంతమవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు సీనియర్ నటి కస్తూరి.

మిస్ చెన్నై టైటిల్ కైవసం చేసుకున్న కస్తూరి:

మిస్ చెన్నై టైటిల్ కైవసం చేసుకున్న కస్తూరికి తర్వాతి కాలంలో సినిమా ఛాన్సులు పోటెత్తాయి. ఈ క్రమంలోనే ‘‘ఆతా ఉన్న కోయిలిలే’’ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈమె అందం, అభినయానికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టడంతో ఆఫర్లు పోటెత్తాయి. అలా సౌతిండియాను 20 ఏళ్ల పాటు ఏలేసింది కస్తూరి. సినిమాల కన్నా ఎక్కువగా కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తూ కస్తూరి వార్తల్లో నిలిచారు.

ఇప్పుడు సీరియల్స్‌తో బిజీగా వున్న కస్తూరి:

అలా ఒకప్పుడు సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా వున్న కస్తూరి .. ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలతో పాటు సీరియల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మా టీవీలో ప్రసారవమవుతున్న ఇంటింటి గృహలక్ష్మీలో కస్తూరి నటిస్తున్నారు. దీనితో పాటు మిగిలిన ఆఫర్లతోనూ ఆమె ఈ వయసులోనూ బిజీగా వుంటున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో కస్తూరి ఓ ప్రాణాంతక వ్యాధి బారినపడ్డారు. ఆమె చికెన్ పాక్స్ (అమ్మవారు) బారినపడ్డారు. ఈ విషయాన్ని కస్తూరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో తన శరీరంపై వచ్చిన పొక్కులు చూపిస్తూ.. బాధపడుతూ బుంగమూతి పెట్టింది. ఇది చాలా వరకు ప్రాణహాని కలిగిస్తుందని.. తన శరీరాన్ని మొత్తం వికృతంగా మారుస్తుందన్నారు. అదృష్టవశాత్తూ తన కళ్లకు సోకకపోవడం అదృష్టమని.. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి కస్తూరి ధన్యవాదాలు తెలిపారు. అయితే చికెన్ పాక్స్‌కు చికిత్స నేపథ్యంలో కస్తూరి రెండు వారాల పాటు గృహలక్ష్మీ సీరియల్‌లో కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.