వైజాగ్ లో ఈనెల 17న డా.మంచు మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకకు భారీ ఏర్పాట్లు
- IndiaGlitz, [Friday,September 16 2016]
సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈతరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఇలా పలు రంగాల్లో తనదైన శైళిలో అద్భుతంగా రాణించి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. ప్రస్తుతం కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలో రాణిస్తున్నారు.మోహన్ బాబు సినీ రంగంలో నటుడిగా 40 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు కార్యక్రమాలను నిర్వహించారు. అంతే కాకుండా ఇప్పుడు టి.సుబ్బరామిరెడ్డి ఈ వేడుకను వైజాగ్ లో ఈనెల 17న ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 17న టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు కావడం విశేషం. ఈ వేడుకకు ఉత్తరాది, దక్షిణాదికి చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ....నా ఆధ్వర్యంలో శివాజీ గణేషన్, ఆశాబొంస్లే, రాధిక, బాలమురళీకృష్ణ, జానకి, పి.సుశీల వంటి ఎందరినో సత్కరించడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే మోహన్‌బాబును సత్కరించడం మరో ఎత్తు ఎందుకంటే మోహన్‌బాబునాకు ఒక మంచి ఆత్మీయుడు, గ్రేట్ ఆర్టిస్ట్. ఎంతో గొప్ప నటుడే కాదు, ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి. నటుడుగా 40 సంవత్సరాలను పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. నటుడుగా, నిర్మాతగా కళారంగానికి సేవ చేస్తున్నాడు.అలాగే విద్యా సంస్థల అధినేతగా పేద విద్యార్థులకు సేవ చేస్తున్నారు.
అలాగే తన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్‌లతో పాటు కుమార్తె లక్ష్మీ మంచుని స్టార్స్‌ను చేశాడు. అందరూ కళారంగానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్‌కు దర్శకరత్న డా||దాసరి నారాయణరావుగారితో పాటు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లతో పాటు శ్రీదేవి, జయప్రద, జయసుధ, అలాగే ఈ తరం హీరోయిన్స్ అనుష్క, కాజల్ అగర్వాల్ సహా అందరూ ఈ వేడుకకు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వైజాగ్‌లోని ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నాం అన్నారు.
విష్ణు మంచు మాట్లాడుతూ...సుబ్బరామిరెడ్డిగారు కళలను ఎంతగానో అభిమానిస్తారు, ఆదరిస్తారు, ప్రేమిస్తారు. మా జనరేషన్‌లో ఆయనలా కళలను ప్రేమించేవారే లేరు. ఇంకేవరైనా సుబ్బరామిరెడ్డి అంకుల్ పుట్టినరోజునాడు నాన్నగారి 40 నట వసంతాల సెలబ్రేషన్స్ చేస్తానంటే నాన్నగారు ఒప్పుకునేవారు కాదు, కేవలం సుబ్బరామిరెడ్డిగారి అంకుల్‌పై ఉన్న ప్రేమతో నాన్నగారు ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు మాతో పాటు నటించిన నటీనటులు, ఇతరులు హాజరవుతున్నారు అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ...నాన్నగారు సినీ ఆర్టిస్టుగా 40 సంవత్సరాలును పూర్తి చేసుకున్నారు. సుబ్బరామిరెడ్డి అంకుల్ పుట్టినరోజునాడు, నాన్నగారి 40 నట వసంతాలను జరుపుకోవడం అనేది సంతోషంగా ఉంది. వైజాగ్‌లో ఎప్పుడో స్టార్ క్రికెట్ కోసం ఇంత మంది నటీనటులు పాల్గొన్నారు. దాని తర్వాత ఇప్పుడే ఇంత మంది స్టార్స్ వస్తున్నారు. నాన్నగారితో నటించిన వారితో పాటు మాతో కలిసి నటించినవారందరూ కూడా ఈ వేడుకలో పాల్గొంటారు అన్నారు.