RK Roja : సముద్రంలో మంత్రిగారి జలకాలు.. చెప్పులు మోసిన ప్రభుత్వోద్యోగి, వివాదంలో రోజా

  • IndiaGlitz, [Thursday,February 09 2023]

ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంలో దిట్ట అయిన మంత్రి ఆర్కే రోజా ఇటీవల తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఏకంగా ప్రభుత్వోద్యోగితో చెప్పులు మోయించారు. వివరాల్లోకి వెళితే.. పర్యాటక శాఖ మంత్రి హోదాలో వున్న రోజా గురువారం బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ను సందర్శించారు. అక్కడి మత్స్యకారులు, పర్యాటకులతో ముచ్చటించిన ఆమె సముద్రంలో దిగి సరదాగా గడిపారు. అయితే మంత్రిగారు నీళ్లలోకి దిగిన సమయంలో ఆమె చెప్పులను ఓ ఉద్యోగి పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూర్యలంక బీచ్ అభివృద్ధిపై రోజా సమీక్ష:

అంతకుముందు సూర్యలంక బీచ్ అభివృద్ధికి సంబంధించి రోజా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇక్కడి హరిత రిసార్ట్‌లను అభివృద్ధి చేయడంతో పాటు బీచ్ దగ్గరిలోని 8 ఎకరాల స్థలాన్ని డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రోజా సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఆర్కే బీచ్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినది సూర్యలంక బీచేనని మంత్రి అన్నారు.

ఆ మధ్య మెగా బ్రదర్స్‌పై రోజా కామెంట్స్ :

అయితే మంత్రి రోజా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలినీ టార్గెట్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ పవన్‌ కళ్యాణ్‌పై మాత్రమే విరుచుకుపడే రోజా నేరుగా మెగా బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించడం వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌లను ముగ్గురిని సొంత జిల్లా ప్రజలే ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్ధమవుతోందన్నారు. సినీనటులు అందరికీ సాయం చేస్తారని.. కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నంగా వున్నారంటూ రోజా విమర్శించారు. చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ కల్యాణ్ మూతికి ప్లాస్టర్ వేసుకుంటాడంటూ ఆమె తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇప్పటంలో గోడలకు ఇచ్చిన విలువ... తొక్కిసలాటలో చనిపోయిన వారికి పవన్ ఇవ్వడం లేదని రోజా ఎద్దేవా చేశారు. దీనికి చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లు విడివిడిగా గట్టి కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే..