Governor:తమది రైతులు, పేదల ప్రభుత్వం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..

  • IndiaGlitz, [Monday,February 05 2024]

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంతో సమావేశాలను ప్రారంభించారు. తన ప్రసంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. తన ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. సామాజిక సాధికారికతలో భాగంగా విజయవాడలో భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామని చెప్పారు. ఇది పేదల ప్రభుత్వమని తెలిపారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నామని.. మనబడి, నాడు-నేడు పథకాల ద్వారా పాఠశాలల రూపరేఖలు మారిపోయాయన్నారు. ఏపీ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధనను అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9లక్షల 52వేల 925 ట్యాబ్‌లు పంపిణీ చేశామని వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం అమలు చేయడంతో పాటు ప్రతి ఏటా ఒక్కో తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తామని స్పష్టంచేశారు. అలాగే విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామన్నా.

ఇక 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్దలో భాగంగా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ.3,367 కోట్లు ఖర్చు చేశామని విద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తోన్నామని.. 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి, 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రస్తావించారు.

రాష్ట్రానికి వెన్నెముక లాంటి రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. 10,778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్నామని.. ఇప్పటివరకూ 53.53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చామన్నారు. ఇందుకోసం రూ. 33,300 కోట్లు కేటాయించామన్నారు. అంతేకాకుండా మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. వైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం అందించామని.. 78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ.25, 571 కోట్లు అందజేసినట్లు గవర్నర్ వెల్లడించారు.

మరోవైపు గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సమావేశాలు ప్రారంభానికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మద్యపాన నిషేధం, పోలవరం నిర్మాణం, మెగా డీఎస్సీ ఎక్కడ అని ప్రశ్నిస్తూ బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బారికేడ్లు అడ్డుపెట్టి టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే బారికేడ్లను తొలగించి సభ్యులు అసెంబ్లీ లోపలికి వెళ్లారు.