Governor:స్కిల్ కేసులో సంచలన పరిణామం.. సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై విచారణకు గవర్నర్ ఆదేశాలు
- IndiaGlitz, [Friday,October 20 2023]
స్కిల్ డెలవప్‌మెంట్ ప్రాజెక్టు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే ఈసారి ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించడం సంచలనంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశంపై సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్‌మీట్లు పెట్టారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వరుస ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన గవర్నర్.. ఇద్దరు అధికారులపై ప్రభుత్వం తరపున విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు.
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త..
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9వ తేదీన సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అనంతరం సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రభుత్వ అధికారులుగా ఉన్న ఇద్దరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా అరండల్ పేటకు చెందిన ఏపీ యూనైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ క్యాంపైన్ అధ్యక్షుడు సత్యనారాయణ సెప్టెంబర్ 23న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి గవర్నర్ లేఖ..
ప్రభుత్వ అధికారులుగా ఉంటూ ప్రతిపక్ష నేతపై వైసీపీ నేతల మాదిరిగా చట్ట విరుద్ధంగా ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరం చేశారని నిర్ధారణ కాకుండానే చంద్రబాబు నేరం చేశారని పదేపదే ఆరోపించారని తెలిపారు. చట్ట విరుద్ధంగా వ్యవహరించిన సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను సైతం గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఈ ఫిర్యాదుపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్పందించారు. సీఐడీ చీఫ్, ఏఏజీ తీరుపై ఎంక్వయిరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు.