TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం
Send us your feedback to audioarticles@vaarta.com
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బోర్టు చైర్మన్ జనార్థన్ రెడ్డితో పాటు సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి రాజీనామాలను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్‌లో ఉంచారు. పేపర్ లీకేజీ బాధ్యులు ఎవరో తెలియకుండా రాజీనామాలు ఆమోదించడం సమంజసం కాదని ఆమె భావించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అడిగారు. అయితే వారి రాజీనామాలపై సర్కార్ నుంచి ఎలాంటి అభ్యంతరం రాలేదు. దీంతో న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ తాజాగా వారి రాజీనామాలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలోనే కొత్త బోర్టు ఏర్పాటు కానుంది. ఇప్పటికే ప్రభుత్వం పలువురు అధికారుల పేర్లను పరిశీలిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని యువత గవర్నమెంట్ ఉద్యోగులు సాధించేందుకు అవసరమైన పరీక్షలను TSPSC నిర్వహిస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు పేపర్లు లీక్ కావడం సంచలనంగా మారింది. దీంతో అనేక మంది నిరుద్యోగులు పరీక్షలు రాసే అవకాశం కోల్పోయారు. అప్పటి నుంచి పేపర్ల లీకేజీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఈ క్రమంలోనే ఇందుకు కారణమైన కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే యువత భవిష్యత్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు. కానీ అప్పటి కేసీఆర్ సర్కార్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ప్రభుత్వం మారడంతో మళ్లీ ఆయన రాజీనామా చేశారు. దీంతో తాజాగా కొత్త ప్రభుత్వం నిర్ణయంతో రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout