ముంపుకు గురైన లంక గ్రామాలను సర్కార్ ఆదుకోవాలి!
Send us your feedback to audioarticles@vaarta.com
వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు నష్టపరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, పార్టీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ అప్పికట్ల భరత్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక్క గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోనే 17 లంక గ్రామాలు కృష్ణా వరదతో తీవ్రంగా నష్టపోయి ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను కలిసి.. వరద నష్టంపై నివేదికను సమర్పించారు. రైతులు, కార్మికులు, మత్స్యకారులు, చేతి వృత్తులవారు, డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను వివరించారు.
నివేదిక..!
ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.."వరదల ముంపు బారినపడ్డ గ్రామాల్లో గత కొన్ని రోజులుగా అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించడం జరిగింది. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో రైతులకు రుణ మాఫీ చేయాలి. రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి. బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయంలో చేసిన క్రాఫ్ ఇన్సురెన్స్ క్లెయిమ్ పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలి. పసుపు, కంద లాంటి పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. తదుపరి పంట కోసం వారికి విత్తనాలు కూడా లభించని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలి. వ్యవసాయ సంబంధ రంగాల మీద ఆధారపడి ఉన్న కూలీలకు 6 నెలల వరకు పనులు ఉండని పరిస్థితి నెలకొంది. ఆ కాలంలో వారికి ప్రభుత్వం తక్షణం నిత్యావసర వస్తువులు సరఫరా చేసే బాధ్యతను తీసుకోవాలి. పనులకు వెళ్లే డ్వాక్రా మహిళలకు 6 నెలల పాటు రుణాలపై వడ్డీ మాఫి చేయాలి. వరద ముంపు ప్రాంతాల్లో 6 నెలల పాటు ఎలక్ట్రిసిటీ బిల్లులు మాఫీ చేయాలి. వలలు కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వమే కొత్త వలలు అందించాలి" ఈ సందర్భంగా ఆయన సర్కార్‌ను కోరారు. పైన చెప్పిన విషయాలే కాకుండా వరదలతో ఎవరైతే నష్టపోయారో వారి కుటుంబీకులను ప్రభుత్వమే ఆదుకోవాలని భరత్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments