ఫృథ్వీ సరస సంభాషణ ఎఫెక్ట్ : కీలక నిర్ణయం!

సినీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ ఓ ఉద్యోగినితో ఆయన జరుపుతున్న సరస సంభాషణ ఆడియో వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం రాజీనామా చేయాలని కోరక మునుపే రాజీనామా చేసేసి బయటికొచ్చేశారు. అయితే ఈ వ్యవహారం అనంతరం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి పృథ్వీ తర్వాత చైర్మన్‌గా ప్రముఖ యాంకర్ స్వప్న, డమరుఖం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినపడ్డాయి. వీరిద్దరూ ఇప్పటికే ఎస్వీబీసీలో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఎవరిలో ఒకర్ని పృథ్వీ స్థానంలో నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే.. అదేం లేదని ఎవర్నీ నియమించకూడదని.. ఆ పోస్ట్‌ను అలాగే ఖాళీగానే పెట్టేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎస్వీబీసీలో కీలక మార్పులు చేసింది. మునుపెన్నడూ లేని విధంగా ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ పోస్టును ప్రభుత్వం సృష్టించి.. టీటీడీ అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి ఆ పదవి కట్టబెట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను శుక్రవారం సాయంత్రం జారీ చేసింది. అయితే పృథ్వీ వ్యవహారంతో పెనుమార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతేకాదు ఇకమీదట ఎస్వీబీసీ ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడినట్లు తెలిసినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం తేల్చి చెప్పిందట. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు ఉండగా.. మరో ఇద్దరు డైరెక్టర్లను అదనంగా నియమించాలని.. అలా చేస్తే చైర్మన్ పదవికి ఇక ఎవరూ అక్కర్లేదని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.