close
Choose your channels

TGSRTC:టీజీఎస్ఆర్టీసీ లోగోపై ప్రభుత్వం కీలక ప్రకటన

Thursday, May 23, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త పదం టీఎస్‌ నుంచి టీజీగా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే టీజీ పేరును గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ పేరును మారుస్తూ అధికార ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు కేవలం వాహనాల నెంబర్ ప్లేట్ల మీదే టీజీగా మారిన పదం.. ఇప్పుడు అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో ఆయా శాఖలు జారీ చేసే ఉత్తర్వుల్లో మార్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు శాఖలు పేరు మార్పు చేపట్టగా.. తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ ఆర్టీసీగా(TGSRTC) మార్చుతూ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో సంస్థ లోగోను కూడా మార్చినట్లు సోషల్ మీడియాలో ఓ లోగో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీని పోలిన విధంగా ఆ లోగో ఉంది. అయితే లోగో మార్పుపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని చెప్పారు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో ఫేక్‌ అని తేల్చేశారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని.. త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని ఆయన ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మారిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజా గేయ రచయిత అందెశ్రీ సమావేశం అయ్యారు. ఇప్పటికే ఉన్న ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ అనే పాటను ప్రజాకవి అందెశ్రీ రచించారు. ఈ పాట రాష్ట్రవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా ఈ పాటను ఆలపిస్తున్నారు. కాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక ఈ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని మార్పులు చేసిన విషయం విధితమే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్‌ పేరును అధికారికంగా వాడేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఆర్ఎస్‌ పార్టీకి దగ్గరగా ఉంటుందని టీఎస్ పేరు గతంలో చేర్చారని సీఎం ఆరోపించారు. అందుకే అందరికి వాడుక భాషలో ఉండేలా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గ తీర్మానం పంపించింది. దీంతో ఇటీవలే కేంద్రం టీజీగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోని అధికారులు తక్షణమే రాష్ట్ర కోడ్‌ను టీజీగా మారుస్తూ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.