పెడన వారాహి సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది: పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
వారాహి యాత్రలో భాగంగా బుధవారం పెడనలో జరగబోయే సభలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెడన సభను అడ్డుకునేందుకు దాదాపు 2వేల మంది కిరాయి మూకలను రంగంలోకి దింపారనే సమాచారం తన వద్ద ఉందన్నారు. సీఎం జగన్, డీజీపీ, హోంమంత్రి, పోలీసులకు ఒక్కటే చెబుతున్నా.. రేపటి సభలో ఏదైనా అయితే తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అనుమానంగా కనబడితే చుట్టుముట్టండి.. ఎదురుదాడి చేయవద్దు..
జనసైనికులు, తెలుగు తమ్ముళ్లను కోరుతున్నా.. రాళ్ల దాడి జరిగితే ఎదురుదాడి చేయకుండా ఉండాలన్నారు. కత్తులు, కర్రలు లాంటి ఆయుధాలతో ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే వెంటనే వారిని చుట్టుముట్టండని.. అందరం కలిసి వారిని పోలీసులకు అప్పగిద్దామని కోరారు. జగన్ పులివెందుల రాజకీయం చేస్తానంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. క్రిమినల్ వేషాలు వస్తే భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పవన్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన, టీడీపీ పొత్తు విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
వైసీపీకి కాదు.. ప్రజలకు విధేయులుగా పని చేయండి..
అలాగే అధికారులు, పోలీసులు కూడా వైసీపీ కోసం కాదు.. ప్రజలకు విధేయులుగా పనిచేయండని పవన్ సూచించారు. రాజ్యాంగం కల్పించిన విధానాలు ప్రకారం నడుచుకోవాలని కోరారు. సహజ వనరుల రక్షణ అధికారులదేనన్నారు. అధికారమే పరమావధిగా జగన్ అనేక హామీలు ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలు వింటూంటే ప్రజలు ఎలా జగన్‌ను నమ్మి ఓటు వేశారని తెలిపారు. వచ్చిన ప్రతి సమస్యను రాబోయే జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వంలో పరిష్కరిస్తామని పవన్ వెల్లడించారు.
కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్ర..
కాగా నాలుగో విడత వారాహి యాత్రను కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న అవనిగడ్డలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2024లో వచ్చేది జనసేన-తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఇవాళ మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యలపై పలువురు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. అలాగే అక్టోబర్ 4న పెడన, అక్టోబర్ 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments