Raja Singh : లైన్ దాటారు.. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్, ఆ పదవిలోంచి కూడా తొలగింపు
- IndiaGlitz, [Tuesday,August 23 2022]
ఓ వర్గాన్ని కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గోషా మహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దేశవ్యాప్తంగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం ఆయనను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అయితే రాజాసింగ్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా తెలంగాణలో బీజేపీ శాసనసభాపక్షనేతగానూ రాజాసింగ్‌ను తప్పించింది.
పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజో నోటీసు:
రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీ నియమావళికి విరుద్ధంగా వున్నాయని క్రమశిక్షణ సంఘం భావించింది. కమిటీ సూచన మేరకు ఆమనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రకటన చేసింది. అలాగే పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని.. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.
రాజాసింగ్ ఇంటి వద్ద హైడ్రామా:
అంతకుముందు సోషల్ మీడియాలో రాజాసింగ్ పెట్టిన వీడియోపై మజ్లిస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పాతబస్తీలో ఆందోళనకు దిగాయి. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా రాజాసింగ్ వ్యవహరిస్తున్నారంటూ భవానీ నగర్, డబీర్ పురా, రెయిన్ బజార్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన షాహినాయత్ గంజ్ పోలీసులు మంగళవారం రాజాసింగ్‌ను ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు పాతబస్తీలో ఎంఐఎం ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.