Download App

Goodachari Review

2016లో క్ష‌ణం సినిమాతో స‌క్సెస్ అందుకున్న అడివిశేష్‌.. రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత స్పై థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ చిత్ర‌మే గూఢ‌చారి. తెలుగు ప్రేక్ష‌కుల‌కు గూఢ‌చారి సినిమాలంటే గుర్తుకు వ‌చ్చే ముందు హీరో కృష్ణ‌, త‌ర్వాత చిరంజీవి. .. చాలా కాలం త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ స్పై థ్రిల్ల‌ర్ టీజ‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత అంచ‌నాల‌ను భారీగా పెంచేసుకుంది. మ‌రి ఈ భారీ అంచ‌నాల‌ను సినిమా అందుకుందా?  లేదా?  అని తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం... 

క‌థ‌:

రా విభాగంలో ప‌నిచేసే ర‌ఘువీర్‌ని టెర్ర‌రిస్టులు చంపేయ‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. ర‌ఘువీర్ కొడుకు గోపి(అడివిశేష్‌)ని సంర‌క్షించే బాధ్య‌త‌ను అత‌ని మావ‌య్య స‌త్య‌(ప్ర‌కాశ్ రాజ్ ) తీసుకుంటాడు. గోపీ పేరుని అర్జున్‌గా మార్చేస్తాడు. పెరిగి పెద్ద‌యిన అర్జున్ తండ్రిలా రా లో ప‌నిచేయాల‌నుకుంటాడు. అందుకోసం 174 సార్లు అప్లై చేసుకుంటాడు. చివ‌రికి 175వ‌సారి అత‌న్ని టెస్ట్ పెట్టి ఎంపిక చేసుకుంటారు. ట్రైనింగ్ స‌మ‌యంలో ఎదురు ఫ్లాట్‌లోని సైకాల‌జిస్ట్ స‌మీర‌(శోభిత‌)ను ప్రేమిస్తాడు అర్జున్‌. అయితే ట‌ర్ర‌రిస్టులు ప్లాన్ వేసి రా అధికారుల‌ను చంపేసి ఆ క‌ట్ర‌లో అర్జున్‌ను దోషిగా చూపిస్తారు. అప్పుడు అర్జున్ త‌న‌పై ప‌డ్డ కుట్ర నుండి బ‌య‌ట ప‌డ‌టానికి కేసులోకి ఇన్‌వాల్వ్ అవుతాడు. కేసుని చేధించే క్ర‌మంలో అర్జున్‌కి న‌మ్మ‌లేని నిజాలు తెలుస్తాయి. టెర్ర‌రిస్టు నాయకుడు, మావ‌య్య స‌త్య‌కి ఉన్న లింకేంటి?  అస‌లు అర్జున్‌ని కుట్ర‌లో ఎందుకు ఇరికిస్తారు?  చివ‌ర‌కు అర్జున్ కుట్ర నుండి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌:

సినిమాకు ప్ర‌ధాన బ‌లం క‌థ‌, స్క్రీన్‌ప్లే.. ద‌ర్శ‌కుడు శశికిర‌ణ్, రాహుల్‌, అడివిశేష్ క‌థను ఆస‌క్తిక‌రంగా.. ప్ర‌తి సీన్ ఎంగేజింగ్‌గా ఉండేలా రాసుకున్నారు. అలాగే ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. శ్రీచ‌ర‌ణ్ నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. ఇక శ‌నీల్ డియో కెమెరా ప‌నిత‌నం సినిమాకు మేజ‌ర్ ఎసెట్ అయ్యింది. ప్ర‌తి సీన్ ఫ్రెష్‌గా, రిచ్ లుక్‌తో ఉంది. ఇక అడివిశేష్ సినిమా మేకింగ్‌లోనే కాదు.. న‌ట‌న ప‌రంగా బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. శోభితా పాత్ర ప‌రిమిత‌మే అయినా చ‌క్క‌గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు ప్రాత‌ను రివీల్ చేసిన తీరు అంద‌రినీ షాక్‌కి గురి చేసింది. ఆ పాత్ర తీరు తెన్నులు అద్భుతంగా ఉన్నాయి. ఇక మ‌ధుశాలిని, అనీష్ అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. 22 ఏళ్ల త‌ర్వాత న‌టించిన సుప్రియ మంచి పాత్ర‌తో రీ  ఎంట్రీ ఇచ్చార‌నే చెప్పాలి. నిర్మాణ విలువ‌లు చాలా బావున్నాయి. సినిమాలో ట్విస్టులు, ట‌ర్న్‌లు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

మైన‌స్ పాయింట్స్‌:

రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చ‌క‌పోవ‌చ్చునేమో.

స‌మీక్ష:

ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకోవాలంటే ముందు బ‌ల‌మైన క‌థ‌, స్క్రీన్‌ప్లే అవ‌సరం. దాన్ని తెర‌పై అద్భుతంగా పండించే న‌టీన‌టులు ఇంకా అవ‌స‌రం. ఇవ‌న్నీ గూఢ‌చారి సినిమాలో చ‌క్క‌గా కుదిరాయి. జేమ్స్‌బాండ్ మూవీ అంటే యాక్ష‌న్ పార్ట్ ఆక‌ట్టుకోవాలి. ఈ సినిమాలో అబ్బో అనేంత‌లా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌లేదు కానీ.. ఉన్నంతో చాలా చ‌క్క‌గా క‌థ‌కు సూట‌య్యేలా కంపోజ్ చేశారు. శ్రీకిర‌ణ్ పాకాల పాట‌లు సినిమా క‌థ‌లో భాగంగానే ఉన్నాయి. రా విభాగం ఎలా చేస్తుంద‌నే విష‌యాన్ని మంచి అనాల‌సిస్‌తో చ‌క్క‌గా చూపించారు. జేమ్స్ బాండ్ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా లాజిక్స్ ఎక్క‌డా మిస్ కాకుండా తెర‌కెక్కించారు. ట్విస్టుల‌ను రివీల్ చేసిన తీరు ఆక‌ట్టుకుంటుంది. దేశం కోసం ఎంద‌రు ఎలా ప్రాణాల‌ర్పిస్తారు. బ‌లహీన‌త‌ను .. బ‌లంగా ఎలా మార్చుకోవాలి .. ఇలాంటి అంశాల‌ను మంచి సంభాష‌ణ‌ల‌తో పొట్రేట్ చేశారు.

బోట‌మ్ లైన్‌:  గూఢ‌చారి.. ఆక‌ట్టుకునే స్పై థ్రిల్ల‌ర్‌

Goodachari Movie Review in English

Rating : 3.3 / 5.0