తెలంగాణ మహిళలకు మరో శుభవార్త.. వడ్డీ లేని రుణాలు మంజూరు
Send us your feedback to audioarticles@vaarta.com
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించనుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు పథకాన్ని కూడా ప్రారంభించేందుకు సిద్ధమైంది. కొంతకాలంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెబుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి 12న 'ఇందిరా క్రాంతి' పథకం పేరుతో మహిళలకు వడ్డీలేని రుణాల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపేసిందని.. తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తుందంటూ తెలిపారు. వడ్డీలేని రుణాల ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా నాలుగు పథకాలను ప్రారంభించామని.. మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించనున్నామని చెప్పారు. మరోవైపు రైతుబంధుకు సంబంధించి కూడా కీలక ప్రకటన చేశారు. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టంచేశారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని.. త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామన్నారు. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు.
ఇక విద్యుత్ ఛార్జీలు కూడా పెంచబోమని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. ఏప్రిల్, మే నెలల్లో 16వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో విద్యుత్ పాలసీని తీసుకు వస్తామని తెలిపారు. సోలార్ విద్యుత్‌ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గృహలక్ష్మి పథకంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు 40,33,702 జీరో బిల్లులు ఇచ్చామని భట్టి వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments