ప్రయాణికులకు శుభవార్త.. రైల్వే ఛార్జీలు తగ్గింపు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రయాణికులకు రైల్వే శాఖ(Indian Railways) శుభవార్త అందించింది. ఎక్స్‌ప్రెస్ స్పెషల్‌గా మారిన ప్యాసింజర్ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టికెట్ బుకింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేటి నుంచే సవరించిన పాత రేట్లే అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో రోజువారి కూలీలు, చిరు వ్యాపారులు, సామాన్యులను పెద్ద ఊరట దక్కనుంది.
కరోనా లాక్‌డౌన్ తర్వాత ప్యాసింజర్ రైళ్లను ‘ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్’ లేదా ‘MEMU/DEMU ఎక్స్‌ప్రెస్’ రైళ్లుగా మార్చిన సంగతి తెలిసిందే. 200 కిలోమీటర్ల దూరానికి మించి ప్యాసింజర్ రైళ్లను నడవకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలోనే క్రమక్రమంగా ఆ రైళ్లను ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ట్రైన్స్‌గా మార్చింది. అయితే ఇందులో లభించే సేవలు మాత్రం యథాతథంగానే ఉండటంతో పాటు వేగం కూడా పెరగలేదు. కానీ ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలతో సమానంగా వసూలు చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలపై భారం పడింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించిన రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాత రేటుకే సెకండ్ క్లాస్ ఆర్డినరీ టిక్కెట్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(MEMU)లో ఆర్డినరీ క్లాస్ టికెట్ ధరలు 50శాతం వరకు తగ్గాయి. పాత ఛార్జీలనే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చీఫ్ బుకింగ్ రిజర్వేషన్ అధికారులకు సమాచారం అందించారు. అన్‌రిజర్వ్‌డ్ ట్రాకింగ్ సిస్టిమ్(UTS)లో కూడా సవరించిన ధరలను అప్‌డేట్ చేశారు. గతంలో ప్యాసింజర్ రైళ్లుగా సేవలందించి ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్‌గా మారిన అన్ని రైళ్లలో ఈ ధరలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments