LRS దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. మార్చి 31వరకు అవకాశం..
Send us your feedback to audioarticles@vaarta.com
లే ఔట్ క్రమబద్ధీకరణ పథకం(LRS) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లే ఔట్‌లను మార్చి 31లోపు క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. దేవాదాయ, వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర భూముల రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
లేఔట్ క్రమబద్ధీకరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్-2020 తీసుకువచ్చింది. దీంతో సుమారు 25 లక్షల మంది ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ చట్టంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవ్వడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా దీనిపై దృష్టి పెట్టిన రేవంత్ ప్రభుత్వం లే ఔట్ల కోసం ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. గతంలో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వనున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ అంటే ఏమిటి..?
అనుమతి లేని లేఔట్‌ల క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిందే ఎల్‌ఆర్‌ఎస్ (Layout Regularization Scheme 2020). ప్రభుత్వ విధివిధానాలు పాటించకుండా చేసిన లేఔట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లేఔట్లను అన్ అప్రూవుడ్ లేఔట్లుగా పరిగణిస్తారు. వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక లేఔట్‌లో మొత్తం భూమిలో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. అయితే అనధికారిక లేఔట్లలో ఇలా స్థలాన్ని వదిలేయకుండా నిర్మాణాలు చేపడుతుంటారు. ఇలాంటి అనధికార లే ఔట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మాణానికి అనుమతులు రాక అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. దీంతో అనేక ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌స్ పథకం తీసుకొచ్చింది.
తాజాగా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వడంతో సుమారు రూ.10వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments