తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఉచిత విద్యుత్‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్..

  • IndiaGlitz, [Tuesday,January 23 2024]

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త అందించింది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న సంగతి తెలసిందే. మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షలకు పెంపు ఇందులో ఉన్నాయి. మిగిలిన హామీలను కూడా వంద రోజుల్లోపు అమలు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు.. ప్రజల నుంచి ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం.. వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తోంది.

వచ్చే నెల నుంచే అమలు..

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశం అయింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నుంచే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్వాహకం వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని.. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందని చెప్పుకొచ్చారు. లక్ష కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట నీళ్లపాలు చేశారని మండిపడ్డారు.

100 రోజుల్లో అమలు చేసి తీరుతాం..

అయినా కానీ 100 రోజుల్లో అన్ని హామీలను అమలు చేసి తీరతామని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి, డ‌బుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు లాంటి ఎన్నో హామీల‌ను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కాగా గత కొన్ని రోజులుగా ఉచిత విద్యుత్ హామీ అమలుపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు డిమాండ్ చేస్తున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు..

ఇటీవల జనవరి నెల కరెంట్ బిల్లులు కట్టకండని ఇటీవల కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వారి విమర్శలకు మంత్రులు కూడా ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. అంతకుముందు నల్లగొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే లండన్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీని బొంద పెడతామని.. ఆ పార్టీ కనుచూపు మేర కూడా కనపడదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పెద్దల వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు దక్కించుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుందనే వాదనలు ఊపందుకున్నాయి.