ఎంఎంటీఎస్ సర్వీసులపై హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్!
- IndiaGlitz, [Monday,June 21 2021]
కోవిడ్ 19 జన జీవితాలని అస్తవ్యస్తం చేసింది. అన్ని రంగాలు కోవిడ్ దాటికి ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. కరోనా వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వాటిలో రవాణా వ్యవస్థ కూడా ఉంది. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రభుత్వాలు పాక్షికంగానే పబ్లిక్ రవాణా సర్వీసులని నడుపుతున్నాయి.
హైదరాబాద్ నగర ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసులు కరోనా కారణంగా గత ఏడాది మార్చి 23న నిలిచిపోయాయి. కొవిడ్ నిబంధనల దృష్ట్యా అప్పట్లో దక్షణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ సర్వీసులని నిలిపివేసింది.
ఇదిలా ఉండగా దాదాపు 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎంటీఎస్ సర్వీసులని దక్షణ మధ్యరైల్వే తిరిగి ప్రారంభించనుంది. ఈ నెల 23న హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. గత కొన్ని రోజులుగా కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు హైదరాబాద్ లో అదుపులోకి వచ్చాయి. దీనితో ప్రభుత్వం కూడా లాక్ డౌన్ ఎత్తివేసింది.
హైదరాబాద్ లో ఎంఎం టీఎస్ సర్వీసులు నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చినట్లు కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ప్రస్తుతానికి రోజుకు కేవలం 10 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నడవనున్నాయి. ఫలక్ నుమా, లింగంపల్లి మధ్య 6, హైదరాబాద్ లింగంపల్లి మధ్య 4 ఎంఎంటీఎస్ ట్రైన్స్ నడవనున్నాయి.