గుడ్ న్యూస్.. రూ.250 కే కరోనా టీకా..
- IndiaGlitz, [Tuesday,December 08 2020]
కరోనా టీకా ఎప్పుడొస్తుందో అనే ప్రశ్న కంటే.. ఆ టీకా ధర ఎంత ఉంటుందోనన్న భయమే సామాన్య ప్రజానీకాన్ని పట్టి పీడిస్తోంది. సీరం ఇన్‌స్టిట్యూట్.. టీకా సామాన్యులకు సైతం అందుబాటు ధరలో దక్కనుంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌కి దశాబ్దాల అనుభవం ఉంది. ఉత్పత్తి సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద టీకా తయారీదారు కావడంతో ఈ సంస్థ మాత్రమే జనాభా పరంగా రెండవ అతిపెద్ద దేశమైన భారత్ అవసరాలు తీర్చేందుకు అనువైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా.. కరోనా టీకాను కేవలం రూ. 250కే అందిస్తామంటూ సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఆక్సఫర్డ్ టీకా ధర రూ. 1000 వరకూ ఉండొచ్చంటూ సీరం సీఈఓ ఆధార్ పూనావాలా గతంలో ప్రకటించారు. అయితే.. టీకాల కోసం ప్రభుత్వాలు ప్రస్తుత తరుణంలో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీకా ధరలు దిగివచ్చే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీకాను కేవలం రూ.250కే ఇస్తామని సీరం ఇన్‌స్టిట్యూల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఆ సంస్థ ఇప్పటి వరకూ స్పందించలేదు.
టీకా పంపిణీ విషయంలో తొలి ప్రాధాన్యం భారత్‌కే అని సీరం గతంలోనే ప్రకటించింది. అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ సీరం ఇటీవలే ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉంటే.. కరోనా టీకాను ప్రజల కోసం వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు కేంద్రం కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. జనాభా పరంగా పెద్దదైనా భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమవడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కేంద్రం వీలైనంత త్వరగా టీకాను ప్రజలకు అందించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.