DSC Notification:నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,February 07 2024]

ఏపీ నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) విడుదలైంది. మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చినట్లు చెప్పారు. ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని.. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్ చేసుకోవచ్చన్నారు. మార్చి 15 నుంచి 30 వరకూ ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్‌ 2న ఫైనల్‌ కీ విడుదల చేస్తామని.. ఏప్రిల్ 7న ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు.

6,100 ఖాళీల్లో 2,280 ఎస్టీజీ పోస్టులు, 2,299స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే టెట్ పరీక్షకు సంబంధించిన వివరాలను కూడా ఆయన ప్రకటించారు. డీఎస్సీ కంటే ముందుగా టెట్ పరీక్ష ఉంటుందన్నారు. ఫిబ్రవరి 8న టెట్ నోటిఫికేషన్ విడుదల కానుందని.. అదే రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 18 వరకూ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ఇక ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకూ వివిధ కేటగిరీల్లో పరీక్షలు నిర్వహిస్తామని.. మార్చి 14న ఫలితాలు ప్రకటిస్తామన్నారు.

డీఎస్సీ, టెట్ పరీక్షలకు సంబంధించిన వివరాలు cse.ap gov.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇదిలా ఉంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్ణయించామని తెలిపారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు పెంచామన్నారు. ఇక నుంచి రెగ్యులర్‌గా డీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. వచ్చిన ఖాళీలను వచ్చినట్లే భర్తీ చేస్తామన్నారు. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్స్ టీచర్లు ఉండేలా చూస్తామని.. ఇచ్చిన కంటెట్‌ను ఎంతవరకు అమలు చేస్తున్నారో నిత్యం పర్యవేక్షిస్తామని బొత్స వెల్లడించారు.