TSRTC:టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం..

  • IndiaGlitz, [Saturday,March 09 2024]

ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్సీ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలవుతుందని వెల్లడించారు. ఈ నిర్ణయంతో 53,071 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుండగా.. ప్రభుత్వ ఖజానాపై రూ.418.11 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 2017లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 16శాతం పీఆర్సీ ఇచ్చిందని.. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్మి పథకం అమలు చేశామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ పథకం విజయవంతంగా సాగుతోందన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యంపై విపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని విమర్శించారు. మహిళలకు ఈ పథకం ఇవ్వాలా..? వద్దా..? అని ప్రతిపక్ష నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం సరికాదని మండిపడ్డారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఏడాదికి రూ.15వేలు ఇస్తున్నామని పొన్ననం వెల్లడించారు.