AP:ఏపీలో పథకాల లబ్ధిదారులకు శుభవార్త.. డీబీటీ నిధులు జమ ప్రారంభం..
- IndiaGlitz, [Thursday,May 16 2024]
ఏపీ ఎన్నికల వేళ చర్చనీయాంశమైన సంక్షేమ పథకాల నిధుల విడుదల ప్రారంభమైంది. పోలింగ్ పూర్తి కావడంతో బుధవారం నుంచి నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బుధవారం ఒక్కరోజే లబ్ధిదారుల ఖాత్లాలో ఆసరా పథకం కింద 1480 కోట్ల రూపాయలు, విద్యాదీవెన కింద 502 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. మిగిలిన అన్ని పథకాలకు త్వరలోనే పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేస్తామని చెప్పింది. రెండు మూడు రోజుల్లో అన్ని పథకాలకు నిధుల విడుదల పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. జనవరి నుంచి వివిధ పథకాలకు ఇవ్వాల్సిన నిధులను పోలింగ్‌కు ముందు విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది.
అయితే దీనిపై ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఇలా నిధులు విడుదల చేస్తే కచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపినట్టు అవుతుందని అభిప్రాయపడిందని పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ సానుభూతిపరులు, పథకాల లబ్ధిదారులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరగ్గా.. నిధులు విడుదల పేరుతో ఓటర్లను ప్రభావితం చేసేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదించారు. మే 13న పోలింగ్ ఉన్నందున పథకాల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తే సమప్రాధాన్యత ఇచ్చినట్టు కాదని పేర్కొన్నారు. జనవరి నుంచి మార్చి 16 వరకు ఇవ్వాల్సిన పథకాల నిధులు ఇప్పటివరకు జమచేయకుండా కావాలనే జాప్యం చేశారని వాదించారు.
అయితే ఈసీ వాదనలపై పిటిషనర్ల తరఫు లాయర్లు స్పందిస్తూ ఇవి కొత్త పథకాలు కావని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. ఇప్పుడు ఇవ్వకుంటే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్.. ఈనెల 11 నుంచి 13వరకు నిధుల విడుదల చేయొద్దని ప్రభుత్వానికి సూచించింది. అయితే శుక్రవారం ఒక్కరోజు మాత్రమే పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు, ప్రచారం వద్దని.. నేతలు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది.
దీనిపై కూడా ఎన్నికల సంఘం అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఎప్పుడో నొక్కిన బటన్లకు ఇన్ని రోజుల నుంచి డబ్బులు చెల్లించకుండా.. పోలింగ్‌కు రెండు రోజులు ముందు ఇవ్వడానికి కారణాలు చెప్పాలని ఆదేశించింది. అసలు ఇప్పటికప్పుడు అంత డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి ఘాటు లేఖ రాసింది. అయితే ప్రభుత్వం నుంచి ఈసీకి సరైన సమాధానం వెళ్లలేదు. దీంతో పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు నుంచి నిధులు విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం నిధుల విడుదల చేపట్టింది.