Gas Price: ఎన్నికల వేళ ప్రజలకు గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు..

  • IndiaGlitz, [Monday,April 01 2024]

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గించింది. నేటి నుంచే తగ్గించిన ధరలు అమల్లో వస్తాయని ప్రకటించింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు సంస్థలు సవరిస్తూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ధరలకు అనుగుణంగా మార్పులు చేస్తుంటాయి. అలాగే ఈ నెల కూడా ఎల్‌పీజీ సిలిండర్లపై రూ.30.50 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇది కేవలం 19కేజీల సిలిండర్‌పై మాత్రమే వర్తిస్తుంది. 14కేజీల సిలిండర్‌ ధర మాత్రం తగ్గించలేదు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విడతల వారిగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సిలీండర్ ధర తగ్గింపు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా గత నెల మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.100 తగ్గిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలాగే మార్చి 7న పీఎం ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీని కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. అంతకుముందు గతేడాది రాఖీ సందర్భంగా ఆగస్ట్ 29న సిలిండర్ రేట్లను రూ. 200 చొప్పున తగ్గించారు. దీంతో ఉజ్వల యోజన లబ్ధిదార్లకు సబ్సిడీ కింద మొత్తం రూ.400 తగ్గింది.

తగ్గిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో రూ.1,795గా ఉన్న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1,764.50కి తగ్గింది. అదేవిధంగా ముంబైలో రూ.1,749 నుంచి రూ.1,717.50కి తగ్గింది. చెన్నైలో మాత్రం 19 కేజీల సిలిండర్‌పై రూ.30 తగ్గించారు. దీంతో ప్రస్తుత ధర రూ.1960.50 నుంచి రూ.1930కు సిలిండర్‌ ధర తగ్గింది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుత ధర రూ. 1,994.50 కాగా, విశాఖపట్టణంలో రూ.1826.50కు చేరింది. మళ్లీ గ్యాస్ కంపెనీలు ధరలను సవరించే వరకు ఇవే ధరలు కొనసాగుతాయి.