వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల శుభవార్త.. పెండింగ్ చలానాలు చెల్లిస్తే డిస్కౌంట్, ఎంతంటే..?
- IndiaGlitz, [Wednesday,February 23 2022]
హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, సీటు బెల్ట్ లేకుండా కారు నడపడం వంటి విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వుంటున్న సంగతి తెలిసిందే. పరిమితికి మించి చలానాలు కట్టని వారి వాహనాలను సీజ్ చేయడం, చివరికి కేసుల వరకు వ్యవహారం వెళుతోంది. ఈ నేపథ్యంలో పెండింగ్ చలానాల విషయంలో వాహనదారులకు శుభవార్త చెప్పారు హైదరాబాద్ పోలీసులు.
భారీ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టేందుకు వీలుగా రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా కొందరు చెల్లిస్తుంటే.. మరి కొందరు మాత్రం వదిలేస్తున్నారు. దీనిపై కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు సమీక్షించారు. గత ఎనిమిదేళ్లుగా వాహనదారులు చెల్లించని జరిమానా రూ.600 కోట్లకు చేరింది.
కరోనా వైరస్ ప్రభావంతో గత రెండేళ్లుగా ప్రజల ఆర్ధిక పరిస్ధితులు దిగజారిపోయాయి. ప్రభుత్వం సైతం ఈ విషయంలో మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై అధికారులు దృష్టి సారించారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు, బస్సులపై ఉన్న పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లించే అవకాశం కల్పిస్తూ అధికారులు దస్త్రం సిద్ధం చేశారు. దీనిని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి పంపించాలని నిర్ణయించారు.
అయితే, డీజీపీ మహేందర్‌రెడ్డి మెడికల్ లీవ్‌పై రెండు వారాలపాటు సెలవుపై వెళ్లడంతో దస్త్రం పెండింగ్‌లో ఉంది. ఆయన తిరిగి విధుల్లో చేరగానే రాయితీపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే, ఎంత మేర రాయితీ ఇస్తారనే దానిపై క్లారిటీ లేదు. ద్విచక్ర వాహనదారులకు 75 శాతం, కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30శాతం రాయితీ ఇచ్చి.. ఆన్‌లైన్, మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించేందుకు అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.