Janasena:ఎన్నికల వేళ జనసేనకు గుడ్ న్యూస్.. పార్టీ గుర్తుపై ఈసీ కీలక ఆదేశాలు..
- IndiaGlitz, [Monday,April 29 2024]
ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. జనసేన పార్టీకి కామన్ సింబల్‌గా గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు కలెక్టర్లతో జరిగిన సమావేశంలోనూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. దీంతో జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు జనసేనకే కేటాయిస్తారు. మిగిలిన స్థానాల్లో మాత్రం ఫ్రీ సింబల్‌గా ఇతరులకు ఈ గుర్తును కేటాయించడం జరుగుతుంది.
కాగా ఇన్ని రోజులు గాజు గ్లాస్ గుర్తు ఎన్నికల సంఘం వద్ద ఫ్రీ సింబల్‌గా ఉండేది. దీంతో ఈ గుర్తును తమకు కేటాయించాలని జనసేన పార్టీ ఈసీని అభ్యర్థించింది. అయితే ఇదే గుర్తు కోసం రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా డిమాండ్ చేశారు. ఇదే విషయమై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగ్గా.. జనసేనకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీకే గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
కొంతకాలంగా పార్టీ గుర్తుపై ప్రతిష్టంభన నెలకొని ఉండటంతో జనసైనికులు, జనసేన నేతలు టెన్షన్ పడ్డారు. అయితే ఎన్నికల సంఘం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసీ నిర్ణయంపై జనసేన పార్టీ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇక నుంచి గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని క్యాడర్‌కు సూచించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మే 13వ తేదీ పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.