జనసేనకు శుభవార్త.. గాజు గ్లాసు గుర్తును ఖరారుచేసిన సీఈసీ..
- IndiaGlitz, [Thursday,January 25 2024]
ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. గాజు గ్లాసు గుర్తును పార్టీకి ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన కేంద్ర కార్యాలయం మెయిల్‌కు ఈ ఉత్తర్వులు అందినట్లు పార్టీ ప్రకటించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించాని ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా గాజు గ్లాసు గుర్తు కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేనాని ధన్యవాదాలు తెలియజేశారు. గత సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసిన విషయం విధితమే. అలాగే ఏపీ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే బరిలో దిగనున్నారు.
కాగా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును గతంలో ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పార్టీకి ఈ గుర్తు ఉండదని ప్రచారం జరిగింది. సైకిల్ గుర్తుపైనే పోటీ చేస్తారని అధికార వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. అయితే జనసేన పార్టీ విజ్ఞప్తితో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ గుర్తు సమస్య తీరడం శుభపరిణామని అభిప్రాయడపడుతున్నారు. సీఈసీ నిర్ణయంతో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయనున్నారు.
మరోవైపు పార్టీలో చేరికలు ఊపందుకున్న సమయంలో ఇలాంటి వార్త రావడంతో జనసేన క్యాడర్లో ఉత్సాహం నెలకొంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్.. అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరికి కండువా కప్పిన జనసేనాని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, కొణతాల రామకృష్ణ కూడా పార్టీలో చేరనున్నారు. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, క్రికెటర్ అంబటి రాంబాబు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.