కొత్త రకం కరోనా వేరియంట్ విషయమై గుడ్ న్యూస్!
- IndiaGlitz, [Wednesday,December 23 2020]
కొత్త రకం కరోనా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో పలు దేశాలు యూకేకు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. యూకే నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తోంది. కాగా.. ప్రస్తుత తరుణంలో జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థ ఓ శుభవార్త చెప్పింది. ఫైజర్‌తో కలసి తాము సంయుక్తంగా రూపొందించిన టీకా కొత్త కరోనాకూ చెక్ పెట్టగలదని వెల్లడించింది. అవసరమైతే కొత్త వైరస్ కోసం ప్రత్యేక టీకాను కూడా వీలైనంత త్వరగా డిజైన్ చేయగలమని తెలిపింది. కేవలం ఆరు వారాల్లోనే ఈ నయా స్ట్రెయిన్‌కు చెక్ పెట్టేలా టీకాను అందుబాటులోకి తీసుకురాగలమని బయోఎన్‌టెక్ సంస్థ ప్రకటించింది.
కాగా.. ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన టీకాతో కొత్త స్ట్రెయిన్‌ను నిలువరించే అవకాశాలు చాలా ఎక్కువని స్పష్టం చేసింది. ఈ మేరకు బయోఎన్‌టెక్ చీఫ్ ఉగుర్ సాహిన్ తెలిపారు. శాస్త్రపరంగా చూస్తే.. ప్రస్తుతమున్న టీకా కొత్త స్ట్రెయిన్‌ను అడ్డుకోగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే.. ఎమ్ఆర్‌ఎన్ఏ టెక్నాలజీతో కొత్త కరోనాకు చెక్ పెట్టే టీకా డిజైనింగ్‌ను వెంటనే ప్రారంభించ వచ్చన్నారు. ఈ సాంకేతికత విశిష్టతను... కేవలం ఆరు నెలల్లోనే టీకాను అందుబాటులోకి తీసుకు రావచ్చని ఉగుర్ సాహిన్ తెలిపారు.