CM YS Jagan: దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు.. రాయి దాడిపై సీఎం జగన్ స్పందన ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
తనపై జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ స్పందించారు. గుడివాడలోని నాగవరప్పాడు వద్ద జరిగిన 'మేమంతా సిద్ధం' సభలో తన గాయం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ప్రజా సంక్షేమం కోసం 130 సార్లు బటన్ నొక్కానని.. మే 13న జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం కోసం మీరు ఫ్యాన్ మీద రెండు బటన్లు నొక్కండని పిలుపునిచ్చారు.
"ప్రజలు అనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు... జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, మన ప్రజల గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడులతో నా సంకల్పం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరదు. ఈస్థాయికి వాళ్లు అంతగా దిగజారారు అంటే విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, విపక్షాలు అంత దూరంగా ఉన్నాయని అర్థం. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, బెదరడు. ప్రజలకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఎంతమాత్రం తగ్గదు.
నా నుదుటిపై వారు చేసిన గాయం కణతకు తగల్లేదు, కంటికి తగల్లేదు. అంటే... మీ బిడ్డ విషయంలో దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా మరో 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ... గతంలో చంద్రబాబు రైతులకు, అక్కచెల్లెమ్మలకు, నిరుద్యోగులకు, వివిధ సామాజిక వర్గాలకు చేసిన గాయాలను ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు. గాయపర్చడం, మోసాలు చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజం అయితే... మీ ఇంటింటికీ మంచి చేయడం మీ బిడ్డ నైజం.
గతంలో ఏ పేద వాడిని ఆదుకోని... మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అవతలి వైపు ఉన్నారు. ఒక్క మీ జగన్ మీద ఒక చంద్రబాబు, ఇక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్... ఇవన్నీ సరిపోవంటూ కుట్రలు, మోసాలు! కుటిల పద్మవ్యూహంలో బాణాలు సంధిస్తోంది ఒక్క జగన్ మీద... మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద. అయినా మీ బిడ్డ అదరడు... బెదరడు.
చంద్రబాబుకు తెలిసింది కుట్రలు చేయడం, దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. ఇలాంటి వాళ్లను నమ్మడం అంటే చేపల చెరువుకు కొంగలను కాపలా పెట్టడమే... దొంగకు తాళాలు ఇవ్వడమే... పులి నోట్లో తల పెట్టడమే. మీ బిడ్డ జగన్ 58 నెలల పాలనలో వైసీపీ మార్కు ప్రతి గ్రామంలో కనిపిస్తుంది. ఇదీ చంద్రబాబుకు మనకు తేడా!" అని జగన్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments