రాజధాని వైజాగ్ ‘నై’: జీఎన్ రావు కమిటీ వివరణ
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధానిపై ఏపీ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలో ఓ కొత్త విషయం వెలుగు చూసిందని.. గత 24 గంటలుగా మీడియాలో కొన్ని ప్రత్యేక కథనాలు కోడై కూసిన సంగతి తెలిసిందే. విశాఖపట్టణాన్ని రాజధానిని చేస్తే వచ్చే అడ్డంకులు ఏంటన్నవే ఆ కథనాల సారాంశం.. రిపోర్ట్‌లోని వ్యవహారం. పర్యావరణ పరంగా విశాఖ చాలా సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ తుపానులు, వరదలతో ముప్పు పొంచి వుందని జీఎన్ రావు కమిటీ స్పష్టం చేసిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంతో వైజాగ్ ‘నై’ అని ఒకట్రెండు చానెల్స్ హడావుడి చేయడంతో ఎట్టకేలకు ఈ వ్యవహారంపై జీఎన్ రావు కమిటీ మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చుకుంది.
జీఎన్‌రావు క్లారిటీ..!
‘మీడియాలో వచ్చిన వార్తలు నిరాధారమైనవి. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నమే అత్యుత్తమం. ఏపీ పరిపాలనా రాజధాని ఏర్పాటుకు విశాఖే బెస్ట్ ఆప్షన్. ఏపీలో విశాఖ ఒక్కటే మెట్రో పాలిటన్ నగరం. తుఫాన్లు అన్ని ప్రాంతాల్లోనూ వస్తాయి. తుఫాన్లు హైదరాబాద్‌లో కూడా వస్తాయ్. సముద్ర తీర ప్రాంతం కోతకు గురికాకుండా ఎవరూ ఆపలేరు. సముద్ర ఒడ్డుకు 50 కి.మీ. దూరంలో రాజధాని ఏర్పాటు చేయాలని సూచించాం. విశాఖ-చెన్నై కారిడార్‌తో అభివృద్ధి జరుగుతుంది. ఏపీలో సమర్ధవంతమైన పాలన అందించేందుకు రాష్ట్రాన్ని నాలుగు జోన్లగా విభజించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులు కమిటీలో ఉన్నారు. అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే నివేదికను రూపొందించాం’ అని జీఎన్ రావు తేల్చిచెప్పారు.
రియాక్షన్ ఏంటో!?
అయితే ఈ వార్తలపై ఇవాళ మధ్యాహ్నమే మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి.. ఆయా మీడియా సంస్థలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ఇవాళే జీఎన్ రావు కూడా మీడియా ముందుకొచ్చేసి అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. మొత్తానికి చూస్తే మీడియాలో వచ్చిన కథనాలతో హడావుడి, జరిగిన ఆందోళనపై ఒక స్పష్టత అయితే వచ్చేసింది. మరి దీనిపై అలా వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలు, ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments