Globalstar Ram Charan:భారతదేశం, భారతీయ సినిమా సత్తా ఇది : జీ 20 సదస్సులో రామ్ చరణ్ అద్భుత ప్రసంగం
- IndiaGlitz, [Tuesday,May 23 2023]
చిరుత చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రామ్ చరణ్ అనతికాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి గారబ్బాయి రామ్ చరణ్ అన్న స్టేజ్ నుంచి.. చరణ్ తండ్రి చిరంజీవి అనే స్థాయికి ఆయన చేరుకున్నారు. సినిమా సినిమాకు డ్యాన్స్, ఫైట్స్, నటనలో వైవిధ్యం చూపుతూ చరణ్ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన స్థాయి ఆకాశాన్ని తాకింది. ఈ చిత్రంలో నటనకు గాను రామ్ చరణ్‌కు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. ఇక ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు సాంగ్‌కు ఏకంగా ఆస్కార్ అవార్డ్ లభించింది. తద్వారా భారతీయ చలన చిత్ర చరిత్రలో చరణ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ సినిమా కారణంగా ఆయన పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. అప్పటి నుంచి చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు.
జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్‌కు చరణ్‌కు ఆహ్వానం :
ఈ క్రమంలో ఆయనకు మరో అరుదైన గౌరవం లభించింది. జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగే ‘‘జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్’’లో పాల్గొనాల్సిందిగా రామ్ చరణ్‌కు ఆహ్వానం అందింది. మే 22 నుంచి మే 24 వరకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారిగా కాశ్మీర్లో ఈ స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భారత సినీ పరిశ్రమ తరపున రామ్ చరణ్ ప్రతినిధిగా హాజరయ్యారు. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తను పాత్ర ఎంత గొప్పదో ఆయనకు తెలుసు. అందుకే కెరీర్‌తో పాటు కాశ్మీర్ అందాలు, తన స్వఅనుభవాలను చరణ్ పంచుకున్నారు.
చిత్ర నిర్మాణానికి భారత్ అనువైన ప్రదేశం:
అంతే కాకుండా ప్రపంచంలో సినిమాల చిత్రీకరణకు సంబంధించిన ప్రాంతాల్లో భారతదేశ సామర్థ్యం గురించి చరణ్ గొప్పగా వివరించారు. ఇండియాలోని గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సుందరమైన ప్రదేశాలు, ఖర్చు, సినిమా ప్రభావం, అత్యాధునిక సాంకేతికతతో పాటు ఈ దేశం చలనచిత్ర నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఎలా మారిందనే విషయాలను చరణ్ బలంగా వినిపించారు. ఫిల్మ్ టూరిజం గురించి ఆయన మాట్లాడుతూనే G20 లోని సభ్య దేశాలు మన దేశంలో చురుకైన భాగస్వామ్యం వహించాలని గ్లోబల్ స్టార్ కోరారు. ఎన్నో ఏళ్లుగా గొప్ప సంస్కృతి, ఆధ్యాత్మికతలతో మిళితమైన మన గొప్పదనాన్ని చిత్ర పరిశ్రమ తరపున తెలియజేసే అవకాశం రావటం తన అదృష్టమన్నారు. మంచి కంటెంట్‌ను ఎంతో విలువైన జీవిత పాఠాలుగా అందించే గొప్పదనం భారతీయ సినిమాల సొంతమన్నారు.
రామ్ చరణ్ రావడం గర్వంగా వుందన్న కిషన్ రెడ్డి :
ఇక ఇదే సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ ..రామ్ చరణ్ తను చెప్పాలనుకున్న విషయాలను అద్భుతంగా వివరించారని ప్రశంసించారు. ఆయన తన వినయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను గెలుచుకున్నారని తెలిపారు. ఈ G20 సమ్మిట్‌కు భారతీయ చలన చిత్ర పరిశ్రమ తరపున చరణ్ ప్రతినిధిగా రావటం గర్వంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ-పర్యాటక రంగం పట్ల ఆయనకున్న అంకితభావం .. భారతదేశ సహజ సౌందర్యాన్ని సంరక్షించడానికి, గొప్పగా ప్రదర్శించడానికి, యువతను ప్రోత్సహించటమే కాకుండా వారికి స్పూర్తిగా నిలుస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.