Ram Charan:థ్రెడ్స్ యాప్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిన రామ్ చరణ్ , యూజర్ ఐడీ ఇదే .. అభిమానులూ మొదలెట్టండి మరి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు టాప్ స్టార్స్ అంతా సోషల్ మీడియాలో చురుగ్గా వుంటున్న సంగతి తెలిసిందే. తమ సినిమాల కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను వారు అభిమానులతో పంచుకుంటున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అందరు స్టార్లకు ఖాతాలున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సరికొత్త మైక్రో బ్లాగింగ్ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘‘థ్రెడ్స్’’ పేరుతో తెచ్చిన ఈ యాప్.. ప్రస్తుతం మైక్రో బ్లాగింగ్ యాప్స్‌లో మార్కెట్ లీడర్‌గా వున్న ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
100కు పైగా దేశాల్లో థ్రెడ్స్ యాప్ లాంచ్ :
ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఆయన చేస్తున్న ప్రయోగాలతో ట్విట్టర్ వినియోగదారులకు మండుతోంది. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు గాను మెటా సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చినట్లే కనిపిస్తోంది. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ట్విట్టర్ వినియోగదారులు ఈ యాప్ వైపు వెళ్లే అవకాశం వుంది. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో యాపిల్, ఆండ్రాయిడ్ ఓఎస్‌లలో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నేమ్‌తోనే థ్రెడ్స్‌ను కూడా వినియోగించుకునే అవకాశాన్ని యూజర్లకు మెటా కల్పించడంతో డౌన్‌లోడ్స్ భారీగా పెరుగుతున్నాయి.
థ్రెడ్స్‌లోకి అడుగుపెట్టిన చరణ్:
సెలబ్రెటీలు కూడా థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తొలి స్టార్‌గా జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. దీంతో ఆయన అభిమానులు, ప్రేక్షకులు కూడా వరుసపెట్టి థ్రెడ్స్ యాప్‌లో ఖాతాలు తెరుస్తున్నారు. ఆ వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా థ్రెడ్స్‌లో ఖాతా తెరిచారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ‘‘@alwaysramcharan’’ పేరుతోనే థ్రెడ్స్ యాప్ కూడా వినియోగించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు.. భారీగా థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అంతేకాదు.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే చరణ్‌కు ఫాలోవర్స్‌గా వచ్చి చేరారు.
కూతురితో ఆడుకుంటున్న చరణ్ :
కాగా.. పెళ్లయిన దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జూన్ 20న హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఉపాసన . ప్రస్తుతం పుత్రికోత్సాహంతో వున్న చరణ్.. కొద్దిరోజుల పాటు సినిమాలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా వుంటూ భార్యాబిడ్డలతో గడుపుతున్నారు. నెమ్మదిగా షూటింగ్‌లకు కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఈ కామర్స్ సంస్థ ‘‘మీషో’’ కోసం ఆయన ఓ యాడ్‌లో నటించారు. బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్ , దీపికా పదుకొణే, కోలీవుడ్ నటి త్రిషలతో చరణ్ వర్క్ చేశారు.
శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న చరణ్ :
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments