Ram Charan:రామ్‌చరణ్ ఇంట్లో దీపావళి వేడుకలు : హాజరైన మహేశ్, ఎన్టీఆర్, బన్నీ .. స్పెషల్ అట్రాక్షన్‌గా వెంకీ మామ

  • IndiaGlitz, [Sunday,November 12 2023]

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జీవితంలో ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా కుటుంబానికి, సన్నిహితులకు అంతే సమయం కేటాయిస్తారు. షూటింగ్‌లు, వ్యాపారాలు, ఇతరత్రా కార్యక్రమాలతో బిజీగా వున్నా ఆయన మిత్రులను తరచుగా కలుస్తూనే వుంటారు. తాజాగా రామ్ చరణ్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరోలు సతీసమేతంగా హాజరయ్యారు. చిరంజీవి - సురేఖ, నాగార్జున - అమల, వెంకటేశ్ - నీరజ, మహేశ్ బాబు - నమ్రత, జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి, అల్లు అర్జున్ - స్నేహ, వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, మంచు మనోజ్ - మౌనిక దంపతులతో పాటు సాయిథరమ్ తేజ్, మంచు లక్ష్మీ, అఖిల్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ తదితరులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వీరందరికి రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఆతిథ్యం అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విందు భోజనంతో పాటు ఆటపాటలతో స్టార్స్ అంతా సందడి చేశారు.

తమ కుమార్తె క్లీంకార పుట్టాక తొలి దీపావళి కావడంతో చరణ్ దంపతులు ఈ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విజయదశమి వేడుకలు కూడా చరణ్ దంపతులు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. బాలికా నిలయం సేవా సమాజ్‌లోని ఆడపిల్లలతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు రామ్ చరణ్ దంపతులు. ఉపాసన బామ్మ గారు.. ఈ సేవా సమాజ్‌కి మూడు దశాబ్ధాలకు పైగా అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆమె గౌరవార్ధం రామ్ చరణ్, ఉపాసనలు ఈ సేవా సమాజ్‌లోని అనాథ బాలికలతో కలిసి దసరా సంబరాలు జరుపుకున్నారు. ప్రేమ‌ను పంచాలి. సానుకూల దృక్ప‌థాన్ని స‌మాజంలో నాటాలి, సంతోషంగా జీవించాల‌నే ఆలోచ‌న‌ల‌ను బాలిక‌ల‌లో పెంపొందించేలా చరణ్ దంపతులు ఈ ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హించుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజ‌యాన్ని అత్యంత వైభ‌వంగా చాటిచెప్పారు.

ఇకపోతే.. రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్‌తో ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నారు. ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్, అంజలి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘‘గేమ్ ఛేంజర్’’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.