ఇంట్లో ఇల్లాలు ‘టిక్‌టాక్‌’లో ప్రియురాలు.. చివరికిలా!

  • IndiaGlitz, [Monday,October 28 2019]

ఈ మధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ‘టిక్ టాక్’. సినిమాల్లోని పాటలు, పాపులర్ డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా ఒకటేంటి అన్నింటినీ ఈ యాప్ ద్వారా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. గతంలో వచ్చిన డబ్ స్మాష్ లాగానే ఇప్పుడు టిక్ టాక్ ద్వారా అన్నీ చేసుకోవచ్చు. అయితే ఇదే టిక్‌టాక్ ఎంతో మంది జీవితాలను రోడ్డుకీడ్చించి.. మరెంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే పచ్చని కాపురాల్లో ఈ టిక్ టాక్ చిచ్చుపెట్టింది కూడా. ఇలా చాలానే చేసేసింది ఈ టిక్‌టాక్. ఫలానా చోట ఇలా జరిగింది.. అలా జరిగింది.. అని అందరూ వార్తల్లో వినే ఉంటారు. ఇదిగో తాజాగా జరిగిన ఓ ఘటనతో వామ్మో ఇలా కూడా చేస్తారా..? అని షాకవుతారేమో.

ఇదీ అసలు కథ!

టిక్‌టాక్ యాప్ ద్వారా పరిచయమైన ఓ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. మొదటి భార్యకు ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి.. రహస్యంగా రెండో భార్యతో వేరే కాపురం పెట్టాడు. ఇంతవరకూ అంతా ఓకేగానీ మొదటి భార్యను హత్య చేయాలని ప్లాన్ చేయడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. దీని ఫలితం చివరికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడమే. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌కు విజయవాడలో చోటుచేసుకుంది. సత్యరాజు అనే ఉద్యోగికి టిక్ టాక్ అంటే యమా పిచ్చి. ఇలా టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తుండగా ఓ మహిళ పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా.. అది పెళ్లిదాకా వెళ్లింది.

అయితే తనకు పెళ్లి అయ్యిందన్న విషయాన్ని కూడా లెక్కచేయని సత్యరాజు ఆ మహిళను తిరుపతి తీసుకెళ్లి రహస్యంగా పెళ్లిచేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. అయితే భర్త నుంచి తప్పించుకున్న భార్య.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సత్యరాజు రెండో భార్యతో పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సో.. టిక్ టాక్ అనేది సరదా కోసమే వాడండి అంతే తప్ప.. ఇలాంటి చిలిపి పనులు చేసి నెత్తికి తెచ్చుకుని కుటుంబాన్ని రోడ్డున పడేసుకోకండి.