నగరం నిద్రపోయిందా?

  • IndiaGlitz, [Wednesday,December 02 2020]

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అన్ని పార్టీలు ప్రచారం హోరెత్తించాయి. దీంతో నగరం ప్రచార హోరుతో ఊగిపోయింది. దాదాపు పది రోజుల పాటు నగరమంతా ప్రచార జోరుతో ఊగిపోయింది. కానీ ఓటింగ్ అనగానే జనం పారిపోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీసం ప్రచారంలో పాల్గొన్న జనమంతా ఓటేసిన పోలింగ్ శాతం 50కి మించి ఉండేది కానీ ఆ జనం కూడా ఓటు వేయలేదేమో అనిపిస్తోంది. నేటి సాయంత్రం 5 గంటల వరకూ మొత్తంగా 35.80 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్ జరిగింది. ఓల్డ్ మలక్‌పేటలో సీపీఐ, సీపీఎం గుర్తులు తారుమారు కావడంతో అక్కడ మాత్రం పోలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. ఇక్కడ రీపోలింగ్ జరగనుంది. ఇది పూర్తయ్యే వరకూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించకుండా ఈసీ నిషేధం విధించింది. అయితే నగరంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదవడం గమనార్హం. ఆర్‌సీ పురం, అంబర్‌పేట, పటాన్‌చెరు సర్కిళ్లలో అత్యధికంగా ఓటింగ్ నమోదు కాగా.. కార్వాన్, మలక్‌పేట సర్కిళ్లలో అత్యల్పంగా ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు.

ఇవాళ ఉదయం నుంచి ఎక్కడా కూడా నగరంలో ఎన్నికల హడావుడి కనిపించలేదు. రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. నగరం నిద్రపోతుందేమో అనిపించింది. నిరక్షరాస్యులే ఎక్కువ శాతం పోలింగ్‌లో పాల్గొన్నట్టు అనిపించింది. విద్యావంతులు కనీసం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తిని కనబరిచినట్లు కనిపించలేదు. బద్దకం ప్రదర్శించారా? లేదంటే నిర్లక్ష్యం వహించారా? లేదంటే నగరంపై అనాసక్తి.. ఏ పార్టీ వచ్చినా ఒరిగేదేం లేదనేది కూడా కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం, ఎన్నికల సంఘాల వైఫల్యం కూడా కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఓటింగ్ పర్సంటేజీని తగ్గించడంలో సఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.