గ్రేటర్ ఎన్నికల హైలైట్స్...

  • IndiaGlitz, [Tuesday,December 01 2020]

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మందకొడిగానే కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు. ఓవర్ ఆల్‌గా చూస్తే గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నప్పటికీ పలు చోట్ల మాత్రం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మరో చోట ఏకంగా పోలింగ్ రద్దైంది. మంత్రి కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు ఉదయం 11 గంటల వరకూ జరిగిన పోలింగ్ శాతాన్ని ఈసీ వెల్లడించింది.

మంత్రి అజయ్ కాన్వాయ్‌పై దాడి..

కూకట్‌పల్లి ఫోరంమాల్‌ దగ్గర ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతూ.. బీజేపీ కార్యకర్తలకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కారుపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. మంత్రి కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఒకరిద్దిరికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ రద్దు..

ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌ 26లో పోలింగ్‌ రద్దు అయింది. మలక్ పేట డివిజన్ బ్యాలెట్ పేపరులో గుర్తు మారింది. సీపీఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ డివిజన్‌లో ఎన్నికల సంఘం పోలింగ్‌ను రద్దు చేసింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌లో సీపీఐ గుర్తు బదులుగా సీపీఎం గుర్తు వచ్చింది. ఈసీ గుర్తులు పరిశీలించి పోలింగ్‌ రద్దు చేసింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌లో 1, 2, 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌‌ను నిలిపివేశారు. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్‌ను బుధవారం నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది.

ఉదయం 11 గంటల వరకు పోలింగ్ ఇలా..

ఉదయం 11 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని ఈసీ డివిజన్ల వారీగా వెలువరించింది. వనస్థలిపురం 15.69, హస్తినపురం 12.23, నాగోల్ 16.16 శాతం నమోదు కాగా.. మన్సూరాబాద్ 15.84, బీఎన్‌ రెడ్డి నగర్ 15.76, హయత్‌నగర్ 14.99, కేపీహెచ్‌బీ డివిజన్‌లో 17.63, బాలాజీనగర్ 16.27, అల్లాపూర్‌ 22.70, మూసాపేట డివిజన్ 29.16, ఫతేనగర్‌ 17.05, బోయిన్‌పల్లి 14.06 శాతం, బాలానగర్‌ 11.67, కూకట్‌పల్లి 10.61, వివేకానందనగర్ 10.57 శాతం, హైదర్‌నగర్ 13.46, ఆల్విన్ కాలనీలో 13.68 శాతం పోలింగ్‌ నమోదైంది.