జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- IndiaGlitz, [Tuesday,November 17 2020]
జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి మంగళవారం ఉదయం షెడ్యూల్‌ను విడుదల చేశారు. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 18, 19, 20 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన.. 24వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని పార్థసారధి వెల్లడించారు. ఆ తరువాత అభ్యర్థుల గుర్తులు ఖరారు చేయనున్నారు. డిసెంబర్ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ ఉంటే డిసెంబర్ 3న నిర్వహించనున్నారు. డిసెంబర్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
గ్రేటర్‌లో మొత్తం 74.04లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 38,56,770 (52.09 శాతం) కాగా.. మహిళలు 35,48,847 (47.90 శాతం) మంది ఉన్నారు. మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 79,290 మంది ఓటర్లున్నారు. రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,998మంది ఓటర్లున్నారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ www.tsec.gov.inలో ఓటర్ల తుది జాబితాను పొందుపరిచారు. కాగా.. వార్డు సభ్యుల ఎన్నికలకు రిటర్నింగ్ అధికారుల ద్వారా రేపు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే ఎన్నికల నిర్వహణ జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేసినట్లు చెప్పారు. గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పార్ధసారథి వెల్లడించారు. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ అంతా విడుదలై పోయింది. ఇప్పటికే పార్టీలన్నీ గ్రేటర్ సమరానికి సిద్ధమై పోయాయి. ఇప్పటికే ఎత్తులకు పైఎత్తులతో పార్టీలన్నీ ముందుకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోందో డిసెంబర్ 4న తెలియనుంది.