గ్రేటర్ పాఠం: బలవంతుడ నాకేమంటే.. చలిచీమల చేత చిక్కాల్సిందే
Send us your feedback to audioarticles@vaarta.com
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ!
దీని అర్థం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరం చదువుకున్నదే.. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. బీజేపీ సెంట్రల్లో తోపు అయితే అయి ఉండొచ్చు కానీ.. మన స్టేట్ విషయానికి వస్తే మాత్రం చలిచీమే. అటువంటి చలిచీమ చేతిలో చిక్కి బలమైన టీఆర్ఎస్ చావు దెబ్బతిన్నది. సీఎం కేసీఆర్ భాషలో చెప్పాలంటే.. పొట్టొని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టిందట. తెలంగాణను ఇచ్చిన పార్టీ అయిన కాంగ్రెస్‌ని తొక్కేసి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆ పార్టీ నేతలందరినీ లాక్కొని.. దాదాపు ఆ పార్టీని నిర్వీర్యం చేసినంత పని చేశారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో చాప కింద నీరులా ఎదుగుతున్న బీజేపీని టీఆర్ఎస్ అధిష్టానం గ్రహించలేకపోయిందనే చెప్పాలి. కాంగ్రెస్‌ని చావు దెబ్బ తీసిన టీఆర్ఎస్ను బీజేపీ వచ్చి చావు దెబ్బ కొట్టింది. ఊహించని ఈ పరిణామానికి రేపటి రోజున టీఆర్ఎస్ ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకోవల్సి వస్తుందో చూడాలి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటాపోటీ వార్ జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆది నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చింది. దుబ్బాక ఫలితంతో వెంటనే కోలుకుని బీజేపీ చాపకింద నీరులా ఎదుగుతుందన్న వాస్తవాన్ని గ్రహించి వెంటనే ముందస్తుగానే జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించాలని భావించింది. బీజేపీకి ఏమాత్రం సమయం ఇవ్వకుండా వెంటనే ఎలక్షన్స్‌ని నిర్వహించేందుకు వ్యూహం పన్నింది. అంతటితో ఆగక ఎన్నికల నిర్వహణలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వరుస సెలవులను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 1న ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. అంతా అనుకున్నట్టే జరిగినా డామిట్ కథ అడ్డం తిరిగింది. జీహెచ్ఎంసీ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకున్నప్పటికీ నైతిక విజయం మాత్రం బీజేపీదేనని చెప్పక తప్పదు.
నేటి జీహెచ్ఎంసీ ఫలితాలను చూస్తే.. టీఆర్ఎస్ 56, బీజేపీ 49, ఎంఐఎం 43, కాంగ్రెస్ 02. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. టీఆర్ఎస్ పార్టీ 99 వార్డుల్లో ఘన విజయం సాధించి జీహెచ్ఎంసీపై గులాబీ జెండాను రెపరెపలాడించింది. ఇక నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఏఐఎంఐఎం 44 వార్డుల్లో గెలుపొందింది. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ 2 వార్డుల్లో, బీజేపీ 4, టీడీపీ 1 వార్డు చొప్పున కైవసం చేసుకున్నారు. ఎక్కడ 99.. ఎక్కడ 56? బీజేపీ విషయానికి వస్తే ఎక్కడ 4.. ఎక్కడ 49? ఐదేళ్లలో ఈ రేంజ్లో పుంజుకుంటుందని ఎవరూ ఊహించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలనగానే టీఆర్ఎస్ను బీజేపీ దెబ్బ కొడుతుంది అని అంతా భావించారు. కానీ ఈ రేంజ్లో దెబ్బ కొడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. కనీసం బీజేపీ కూడా ఊహించకపోయి ఉండవచ్చు. దుబ్బాక ఫలితం ఇచ్చిన స్ఫూర్తితో బీజేపీ అడుగులు వేసింది. మేయర్ పీఠం దక్కించుకోకపోయినా.. విజయం అంచులకు మాత్రం చేరుకోగలిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com